Bandi Sanjay: ‘మేడిగడ్డ’ కుంగిన ఘటన.. ఆ నష్టాన్ని వారి నుంచే రాబట్టాలి: బండి సంజయ్‌

మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు చేశారు.

Updated : 23 Oct 2023 13:01 IST

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబమే దీనికి బాధ్యత వహించాలని.. జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జమ్మి పూజ చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

 మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవటం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నాణ్యతా ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాలేరనే నాణ్యతకు తిలోదకాలు వదిలారని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటికే తమ పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భాజపా అభ్యర్థుల రెండో జాబితాపై స్పందిస్తూ.. దసరా తర్వాత చర్చించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని