Stalin: తమిళనాడు ప్రజలు ప్రధానిని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు: స్టాలిన్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌   కచ్చతీవు వివాదంపై ప్రధాని మోదీ చేసిన ‘ద్వంద ప్రమాణాల’వ్యాఖ్యలపై  సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

Published : 02 Apr 2024 00:06 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M K Stalin) కచ్చతీవు (Kachathivu) వివాదంపై ప్రధాని మోదీ చేసిన ‘ద్వంద ప్రమాణాల’వ్యాఖ్యలపై సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని అధికార డీఎంకేపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఎన్నికల ముందు భాజపాకు మత్సకారులపై  ఎందుకింత ఆకస్మిక ప్రేమ కలిగిందని ప్రశ్నించారు.

పదేళ్లుగా కుంభకర్ణుడి నిద్రలో ఉండి ఒక్కసారిగా మత్స్యకారులపై ఎన్నికల ప్రేమను ప్రదర్శిస్తున్న వారిని రాష్ట్ర ప్రజలు మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుగా రూపాయి చెల్లిస్తుంటే కేంద్రం అందులోని 29 పైసలే ఎందుకు తిరిగి చెల్లిస్తుంది. మొత్తం పన్ను చెల్లించవచ్చు కదా అని అడిగారు. రెండో ప్రశ్నగా తమిళనాడులో 2023లో చెన్నై, తూత్తుకుడి వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం వరద సాయంగా ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేంద్రంలో గత పదేళ్ల భాజపా పాలనలో రాష్ట్రాభివృద్ధికి ఒక్క ప్రత్యేక పథకమైనా అమలుచేశారా అని నిలదీశారు. ప్రజలను ఇతర విషయాల పైకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు పక్కనపెట్టి ఈ ప్రశ్నలకు స్పందించండి మోదీ అని తమిళంలో రాసిన హ్యాష్‌టాగ్‌తో  స్టాలిన్‌ ప్రధాని మోదీని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అధికార డీఎంకే పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ, కచ్చతీవు సమస్యపై ప్రధానమంత్రి అంతకుముందు రోజు(ఆదివారం) రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు భారత్ అప్పగించే అంశంపై వెలువడుతున్న కొత్త వివరాలు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టాయని ఆయన పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి దివంగత ఎం.కరుణానిధి సైతం ఈ ఒప్పందానికి అంగీకరించారని ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని