Ayodhya: అయ్యో.. రామా!.. అయోధ్యలో భాజపా ఓటమికి ఎన్నో కారణాలు

శ్రీరాముడి జన్మభూమిలో ఆయనకు దివ్యమందిరం నిర్మించాలనే దృఢ సంకల్పంతో దశాబ్దాలపాటు భాజపా శ్రమించింది. కేంద్రంలో వరుసగా పదేళ్లు అధికారం రూపంలో వచ్చిన అవకాశంతో దివ్య రామమందిరాన్ని నిర్మించింది.

Updated : 06 Jun 2024 08:31 IST

ఫైజాబాద్‌ (యూపీ): శ్రీరాముడి జన్మభూమిలో ఆయనకు దివ్యమందిరం నిర్మించాలనే దృఢ సంకల్పంతో దశాబ్దాలపాటు భాజపా శ్రమించింది. కేంద్రంలో వరుసగా పదేళ్లు అధికారం రూపంలో వచ్చిన అవకాశంతో దివ్య రామమందిరాన్ని నిర్మించింది. దేశమంతా పండగ వాతావరణం సృష్టించి.. తాజా లోక్‌సభ ఎన్నికల ముంగిట గత జనవరిలో అట్టహాసంగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహించారు. భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచారు. అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోనే భాజపా అభ్యర్థి అనూహ్యంగా ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫైౖజాబాద్‌లో భాజపా అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ 54,567 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అయోధ్య అంశం స్థానికులను ప్రభావితం చేయలేదా.. రామమందిర నిర్మాణంతో అక్కడ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నా.. భాజపాను ఎందుకు తిరస్కరించారనేందుకు స్థానికులు ఎన్నో ఆసక్తికర కారణాలు చెబుతున్నారు. 

అభివృద్ధి కోసం భూసేకరణపై స్థానికుల్లో అసంతృప్తి

అయోధ్యలో అభివృద్ధి పేరిట విమానాశ్రయం, రహదారుల కోసం చేస్తున్న భూసేకరణపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గొప్ప ఆలయం నిర్మించడం మంచిదే.. కానీ, తమ భూములను లాక్కుంటే ఎలా బతికేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. భూములకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. భూములను తీసుకున్నందుకు అయోధ్యలో దుకాణాలు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని చెబుతున్నారు. 

  • భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు సైతం ఓటర్లను ఆలోచింపజేశాయి. స్థానిక యువతను నిరుద్యోగం వేధిస్తోంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల పేపర్‌ లీకేజీ కావడంతో యువత మండిపడుతోంది. 
  • వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌ ఫైజాబాద్, అయోధ్య ప్రగతికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, పైగా రామమందిరం పేరిట తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారనే అపవాదు ఉంది. అందుకే ఇప్పటికే రెండుసార్లు గెలిచిన లల్లూ సింగ్‌ను స్థానికులు మూడోసారి కంగుతినిపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, పేరున్న దళిత నేతగా అవధేశ్‌ ప్రసాద్‌ అందరికీ పరిచయమున్న వ్యక్తి. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ జనరల్‌ స్థానమైన ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా అవధేశ్‌ ప్రసాద్‌ను నిలబెట్టారు. దీంతో బీఎస్పీ అభ్యర్థి బరిలో ఉన్నా.. దళిత ఓటర్లు సైతం ఆయన్నే ఆదరించారు. 

కొంపముంచిన ‘రాజ్యాంగం మార్పు’ ప్రకటన

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటించిన నేతల్లో లల్లూ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ దుందుడుకు చర్య స్థానిక దళిత, మైనారిటీ ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది. వెరసి ఇవన్నీ రామ జన్మభూమిలో కమలనాథులను కంగుతినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని