S Jaishankar: ‘చైనా నంబర్‌ 1’ అని అప్పుడు నెహ్రూ చెప్పలేదా?: జైశంకర్‌

 భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు.

Updated : 03 Apr 2024 15:03 IST

అహ్మదాబాద్: భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (Jaishankar) అన్నారు. గుజరాత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న సమయంలో నెహ్రూ భారత్‌ను కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారని జైశంకర్‌ నాటి ఘటనలను గుర్తుచేశారు. ముందుగా చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చాక భారత్‌కు ఇవ్వాలని నాడు నెహ్రూ అన్నారని తెలిపారు. కానీ, భాజపా ప్రభుత్వం మాత్రం మన దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు.

‘‘1950ల్లో సర్దార్‌ పటేల్‌ చైనా నుంచి భారత్‌కు ప్రమాదముందని హెచ్చరించారు. భవిష్యత్తులో చైనా, పీవోకే నుంచి సంక్లిష్టమైన పరిస్థితులను దేశం ఎదుర్కోనుందని చెప్పారు. చైనా తీరు అనుమానాస్పదంగా ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ.. నెహ్రూ ఆయన మాటలను కొట్టి పడేశారు. హిమాలయాల అవతల నుంచి భారత్‌పై దాడి చేయడం అసాధ్యమన్నారు. అలాగే కశ్మీర్‌ అంశాన్ని ఐరాస ముందుకు తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టం లేదు. ఈ విధంగా గతంలో జరిగిన పొరపాట్ల వల్లే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కొందరు సరిహద్దుల గురించి మాట్లాడుతూ వాటిని తిరగరాయాలంటున్నారు. మన సరిహద్దులను ఎప్పుడో నిర్ణయించుకున్నాం’’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నించిందని జైశంకర్‌ చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌కు జెట్ ఇంజిన్‌ టెక్నాలజీని అందించేందుకు అమెరికా అంగీకరించిందని, సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేసే మూడు సంస్థలు భారత్‌లో ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని