Congress: కాంగ్రెస్‌ మూడో జాబితా.. తెలంగాణలో ఐదుగురికి చోటు

లోక్‌సభ ఎన్నికలకు 57 అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది.

Updated : 21 Mar 2024 22:10 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి - సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ - దానం నాగేందర్‌, చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ - మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలోని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లోని బహరామ్‌పుర్‌ నుంచి అధీర్‌ రంజన్‌ చౌదరీ బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బర్గా నుంచి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ శిందే కుమార్తె ప్రణితి శిందే మహారాష్ట్రలోని సోలాపుర్‌ నుంచి పోటీ చేయనున్నారు. రాజస్థాన్‌లోని సికార్ లోక్‌సభ నియోజకవర్గాన్ని సీపీఎంకు కేటాయించింది. తాజా జాబితాతో కలిసి కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 139 మంది అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో నాలుగు స్థానాలకు (జహీరాబాద్‌ - సురేశ్‌ కుమార్‌ షెట్కర్‌, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌) అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇంకా.. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని