PM Modi: ఈ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయి: ప్రధాని మోదీ

రానున్న ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Published : 16 Apr 2024 15:36 IST

గయ: రానున్న ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌లోని గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని 'వికసిత భారత్'గా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొందరు అడ్డుకుంటున్నారని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. అటువంటి వారిని శిక్షించేందుకే ఈ ఎన్నికలు  జరుగుతున్నాయని మంగళవారం అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు రాజ్యాంగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అసత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ‘వికసిత భారత్’, ‘వికసిత బిహార్’ కోసమని  తెలిపారు.

ఆర్జేడీ అవినీతికి ప్రతీక అని మోదీ ఆరోపించారు. వారి పాలనలో అవినీతి పరిశ్రమలా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనడానికి ముందు ప్రధాని ఎక్స్‌లో పోస్టు  చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి మాతృభూమి అయిన బిహార్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా- ఎన్డీఏ కూటమికి అపూర్వమైన విజయాన్ని అందించాలని సంకల్పించింది. ఈరోజు మరోసారి, నా కుటుంబసభ్యులను కలిసే అవకాశం  లభించింది. గయ, పూర్ణియాలో జరిగే బహిరంగ సభలో నేను బిహార్‌ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలను అందుకుంటాను.’’ అని తెలిపారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ గయా నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని