Modi Cabinet: భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి

కేంద్ర క్యాబినెట్‌లో రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి ఇచ్చారు.

Updated : 10 Jun 2024 05:50 IST

తెదేపా నుంచి రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ హోదా
సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఛాన్స్‌
దిల్లీలో ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు
పురందేశ్వరి, సీఎం రమేష్‌కు నిరాశ

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఈనాడు - అమరావతి, దిల్లీ: కేంద్ర క్యాబినెట్‌లో రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి ఇచ్చారు. గుంటూరు నుంచి తెదేపా ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి దక్కింది. మరోవైపు నరసాపురం ఎంపీ, భాజపా నేత భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ వర్మ)ను లోక్‌సభ టికెట్‌ మాదిరిగానే అమాత్యపదవి కూడా అనూహ్యంగా వరించింది. తొలి నుంచీ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికే పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్న జాతీయ నాయకత్వం ఆలోచన శ్రీనివాసవర్మకు అదృష్టంగా మారింది. వీరు ముగ్గురూ ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరికి తప్పకుండా మంత్రిపదవి దక్కుతుందని భావించినా నిరాశే ఎదురయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం పురందేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. అయినా పదవి దక్కకపోవడంపై ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన సీఎం రమేష్‌.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయనకూ క్యాబినెట్‌లో స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ

పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు తొలిసారే అదృష్టం

శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడికి ఊహించినట్లుగానే క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ను తొలి దఫాలోనే కేంద్ర (సహాయ) మంత్రి పదవి వరించింది. నరసాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా తొలిసారి గెలిచారు. ఆయన కూడా నేరుగా కేంద్ర సహాయమంత్రి హోదాలోనే లోక్‌సభలో అడుగుపెడుతుండటం విశేషం. 

కౌన్సిలర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకు..

భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ డిగ్రీ చదువుతుండగా వామపక్ష విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1990లో భాజపాలో చేరారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ఆయన అందరికీ భాజపా వర్మగా సుపరిచితులు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమవరంలోని 4వ వార్డు నుంచి భాజపా కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2009లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయనకు అనూహ్యంగా పార్టీ టికెట్‌ కేటాయించింది. ఓ దశలో టికెట్‌ మార్పుపై ఊహాగానాలు సాగినా భాజపా నాయకత్వం వర్మపైనే నమ్మకం ఉంచింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.70 లక్షల మెజారిటీతో గెలిచారు.

నరసాపురం నుంచి రెండో మంత్రి

నరసాపురం నియోజకవర్గం నుంచి 1999లో భాజపా తరఫున గెలుపొందిన ప్రముఖ సినీనటుడు, దివంగత ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుకు కేంద్ర మంత్రి పదవి లభించింది. ఇదే స్థానం నుంచి ఇప్పుడు వర్మకూ కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది.

దేవుడే దారి చూపాడు: పెమ్మసాని చంద్రశేఖర్‌

ప్రజలకు సేవ చేయాలన్న దృఢసంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చే దారిచూపాడని కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ‘తొలిసారి ఎంపీ అయిన నన్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి ఆమోదం తెలిపిన చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. మోదీ క్యాబినెట్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గుంటూరు ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారు. మా మంత్రిత్వ శాఖల తరఫున దేశానికి మా వంతు సేవ చేస్తాం’ అని చెప్పారు. 

భాజపా కార్యకర్తలకు దక్కిన పదవి ఇది: శ్రీనివాసవర్మ

పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందడానికి తానే ఉదాహరణ అని కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ‘పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని నాకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలంతా వచ్చి నా విజయం కోసం పనిచేశారు. మూడు పార్టీల కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధాని మోదీ మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.


హామీల అమలుకు నిర్విరామంగా పనిచేస్తాం

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు 

నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ కష్టాల్లో ఉన్నా ఆదుకుంటూ వస్తోందని, అదే తరహాలో వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తామని కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ పదవులను రాష్ట్ర ప్రజలకే అంకితం చేస్తున్నాం. ఇవి వారి పదవులే తప్ప మా పదవులు కాదు. కేంద్ర మంత్రిమండలిలో పనిచేయడం ఆనందకరం. మా తండ్రి దివంగత ఎర్రన్నాయుడు పైనుంచి నిరంతరం ఆశీర్వదిస్తూ, వెన్నుతట్టి నడిపిస్తున్నారు. నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడితో పాటు, సోదరుడు లోకేశ్, పవన్‌ కల్యాణ్, ప్రధాని మోదీ, బాబాయి అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మా కుటుంబసభ్యులు ఎన్నో త్యాగాలు చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు.

తమ ప్రేమాభిమానాలతో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి చరిత్రాత్మక విజయం చేకూర్చారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు, మోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. రాష్ట్రం కోసం మేం పదేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. మోదీ తొలి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం పొందాం. ఇంకా పొందాల్సినవి ఉన్నాయి. వాటిని సాధించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. రాష్ట్రాన్ని నంబర్‌ 1 స్థానంలో నిలబెట్టాలన్న చంద్రబాబు లక్ష్యసాధనకు సంపూర్ణంగా పనిచేస్తాం. మోదీ సాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. మా నాయకులు మాపై ఏ బాధ్యత పెట్టినా, ఎలా నడిపించినా మేం అంతఃకరణ శుద్ధితో పనిచేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని