Maharashtra: చిచ్చు రేపిన మూడు స్థానాలు.. ‘అఘాడీ’లో అంతర్గత పోరు

మహావికాస్‌ అఘాడీలో అంతర్గత పోరు రగులుతోంది. ముఖ్యంగా మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో అఘాడీ నేతలు ఓ పరిష్కారానికి రాలేకపోతున్నారు.

Published : 30 Mar 2024 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల ముంగిట మహారాష్ట్రలోని (Maharashtra) రాజకీయాలు మళ్లీ మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే శివసేన (Shiv sena), ఎన్సీపీలో (NCP) ఏర్పడిన చీలికలు కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయగా.. తాజాగా కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గాలతో ఏర్పడిన మహావికాస్‌ అఘాడీ కూటమిలోనూ అంతర్గత పోరు తీవ్రమవుతోంది. ఒప్పందానికి విరుద్ధంగా కీలకమైన మూడు స్థానాల్లో శివసేన (యూబీటీ), అభ్యర్థులను ప్రకటించడం వివాదాలకు తావిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శరద్‌పవార్‌ రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

తాజా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సంగలీ, ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నియోజకవర్గాలున్నాయి. భివండీ స్థానంలో ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గం బరిలోకి దిగాలని యోచిస్తోంది. అయితే, ఈ మూడు స్థానాలను తన వద్దే ఉంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలో దీనికి ఓ పరిష్కారం కనుగొనేందుకు గురువారం రాత్రి శరద్‌పవార్‌ నేతృత్వంలో మూడు పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ నుంచి పృథ్వీరాజ్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరట్‌ తదితరులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఈ మూడు స్థానాలపైనే చర్చ జరిగింది. వాటిని వదులుకునేందుకు కాంగ్రెస్‌ ససేమిరా అనడంతో తదుపరి సమావేశం సోమవారానికి వాయిదా పడింది.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహావికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అవే సంగలీ, ముంబయి సౌత్‌ సెంట్రల్‌, భివండీ, ముంబయి వాయువ్య స్థానాలు. అయితే, తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ ప్రకటించడం కూడా కూటమిలో అసంతృప్తికి కారణమవుతోంది. 

శరద్‌పవార్‌ సంప్రదింపులు ఫలించేనా?

వివాదాస్పదమవుతున్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు శరద్‌పవార్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌తోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి సూచన మేరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ రమేశ్‌ అధ్యక్షతన పార్టీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ఎలాంటి పరిష్కారం లభించలేదు. మిత్రపార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, లేదంటే ప్రత్యర్థులకు ఇది అవకాశంగా మారుతుందని శరద్‌పవార్‌ హితవు పలుకుతున్నారు. భివండీ స్థానాన్ని ఆశిస్తున్న ఎన్సీపీ (శరద్‌పవార్‌)కి ప్రతికూలత ఎదురైతే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నసీమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంగలీ, ముంబయి సౌత్‌ సెంట్రల్‌, భివండీ స్థానాలను వదులుకోబోమని, ముంబయి నార్త్‌, ముంబయి వాయువ్య స్థానాల్లోనూ స్నేహపూర్వక పోరాటం ఉంటుందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ తీరును శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితులు భాజపాకి అనుకూలంగా మారుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ పరిణితి చెందిన పార్టీ అనీ, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కూటమిలో ఇలాంటి పొరపచ్చాలు సహజమేనని, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ శివసేన (యూబీటీ) స్నేహపూర్వక పోరు ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు