Rajasthan Elections: గెలుపు గుర్రాలకే టికెట్లు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిందే: అశోక్‌ గహ్లోత్‌

గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే కాంగ్రెస్‌ టికెట్లు కేటాయిస్తుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు.

Published : 18 Oct 2023 01:41 IST

జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల (Rajasthan Assembly Elections) నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపు అవకాశాలున్న వారందరికీ తప్పకుండా టికెట్లు వస్తాయని అన్నారు. ఆయా నియోజవర్గాల స్థాయిలో ఎవరెవరైతే కష్టపడి పనిచేసి, అభివృద్ధికి తోడ్పడ్డారో వారందరికీ తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. 2020లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికి ప్రాధాన్యత ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించగా..  ప్రతి అభ్యర్థి గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకొనే టికెట్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీతో సమావేశమయ్యేందుకు దిల్లీకి పయనమైన గహ్లోత్‌.. జైపుర్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఆ ఎమ్మెల్యే పాత్ర ఎంతో కీలకం. అలాంటి వ్యక్తుల్ని ఎంచుకునేటప్పుడు అధిష్ఠానం కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది’’ అని గహ్లోత్‌ అన్నారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసేందుకుగానూ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీతో భేటీ అయ్యేందుకు ఆయన దిల్లీకి బయల్దేరారు. బుధవారం కమిటీతో చర్చల అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారంటూ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించాలంటే రాజస్థాన్‌లో కచ్చితంగా కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేసి, ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించిన తర్వాతే ప్రధాని మోదీకి ఓటు అడిగే అర్హత వస్తుందని ఈ సందర్భంగా అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. మొత్తం 200 స్థానాలు కలిగిన రాజస్థాన్‌ అసెంబ్లీకి నవంబర్‌ 25న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని