INDIA Bloc: ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఇండియా’

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్‌మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Updated : 05 Jun 2024 07:08 IST

హిందీ రాష్ట్రాల్లో  తిరిగి పుంజుకున్న కూటమి పక్షాలు
వ్యూహాత్మక అడుగులతో పరస్పర లబ్ధి

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్‌మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి సవాల్‌ విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీ భాజపాకు దక్కకుండా నిలువరించగలిగాయి. చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సంఖ్యలో 330 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ 30% మేర గెలుపుతో 99 స్థానాలు గెలుచుకొని గత రెండు ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనపరిచింది. కేరళలో ఒక స్థానం కోల్పోయినా, తమిళనాడులో స్థానాలు నిలబెట్టుకుంది. కర్ణాటక, తెలంగాణల్లో పుంజుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో సంస్థాగత బలం, తమిళనాడులో మిత్రపక్ష డీఎంకే అండతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోగలిగింది. 

భారత్‌జోడో యాత్రతో ఉత్తేజం 

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ అగ్రనేత ప్రారంభించిన భారత్‌జోడో పాదయాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్ని ఉత్తేజితుల్ని చేసింది. మహారాష్ట్రలో భాజపా చేసిన తప్పులు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు కలిసి వచ్చాయి. శివసేనను నిలువునా చీల్చి అనూహ్యంగా ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంతోపాటు, శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీని రెండుగా చీల్చడం ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఒక స్థానం నుంచి 13 స్థానాలకు చేర్చి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించేలా తయారుచేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్సీపీ బలం నాలుగు నుంచి ఏడుకు పెరిగింది. మొత్తంగా ఎన్డీయే బలం 41 నుంచి 18కి పడిపోయేలా చేసింది. రాజస్థాన్‌లో గత రెండు ఎన్నికల్లో సున్నాకి పరిమితమైన హస్తం ఈసారి మిత్రపక్షాలతో కలిసి 11 స్థానాలను గెలుచుకుంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భజనల్‌లాల్‌ శర్మను గత డిసెంబరులో ముఖ్యమంత్రిని చేయడం నచ్చని భాజపా సీనియర్లు కాషాయదళానికి మనస్ఫూర్తిగా పనిచేయకపోవడం నష్టం చేసింది. సచిన్‌ పైలట్‌ విస్తృత ప్రచారంతో గుజ్జర్‌ సామాజికవర్గం కాంగ్రెస్‌కు అండగా నిలవడం వల్ల హస్తం కూటమికి ఇక్కడ 11 సీట్లు దక్కాయి.

చతుర్ముఖ పోరుతో లబ్ధి

కాంగ్రెస్‌ తన బలాన్ని నిలబెట్టుకున్న మరో రాష్ట్రం పంజాబ్‌. ఆప్, కాంగ్రెస్‌లు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా పోటీచేసినా, ఇక్కడమాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డాయి. పోటీ చతుర్ముఖంగా మారి కాంగ్రెస్‌ లబ్ధిపొందింది. అధికారంలో ఉన్న ఆప్‌ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుని పూర్వవైభవాన్ని సంతరించుకొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తూ రావడం; ముస్లిం, యాదవులు, దళితులు ఇండియా కూటమికి అండగా నిలవడం ఎస్పీ-కాంగ్రెస్‌లకు కలిసి వచ్చింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు దిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపకపోయినా ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ అరెస్టు అక్కడి ఫలితాలను ప్రభావితం చేయడంతో ఇండియా కూటమికి 5 స్థానాలు దక్కాయి. రాహుల్‌గాంధీ భారత్‌జోడో న్యాయయాత్ర మణిపుర్‌ నుంచి మొదలుపెట్టి ముంబయిలో ముగించడంవల్ల ఆ రెండురాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయోజనం పొందగలిగింది. హరియాణాలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని మార్చడం భాజపాకు వ్యతిరేకంగా పనిచేసింది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచిన భాజపా ఇప్పుడు 5 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 

స్థానిక అంశాలపై పోరుతో మంచి ఫలితం 

కాంగ్రెస్‌పార్టీ ఈ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానిక అంశాల ఆధారంగానే పోరాడటం వల్ల మంచి ఫలితాలను సాధించగలిగింది. సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుని ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలకంటే మమతాబెనర్జీయే బలంగా కనిపించడంతో భాజపా విధానాలు నచ్చని ఓటర్లంతా తృణమూల్‌ వైపే మొగ్గుచూపారు. దీంతో తృణమూల్‌ బలం 22 నుంచి 29కి పెరిగింది. మహారాష్ట్రలో 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉల్లిపంట ప్రధాన ఆదాయవనరు. గతంలో ఈ స్థానాలు ఏకపక్షంగా ఎన్డీయేకు దక్కాయి. ఈసారి వీటిల్లో ఏడు సీట్లు ఇండియా కూటమికి వెళ్లాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల విధానంలో తరచూ మార్పులు చేస్తుండటం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇండియా కూటమి కారణంగా కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, శరద్‌పవార్, ఆర్‌జేడీ, ఎన్సీపీ (శరద్‌చంద్రపవార్‌), శివసేన (యూబీటీ), జేఎంఎం, వామపక్షాలు ప్రయోజనం పొందగలిగాయి. రాహుల్, ప్రియాంకాగాంధీ పర్యటనలతో పాటు సిద్దరామయ్య, డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, సచిన్‌ పైలట్‌లాంటి నాయకులు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడంలో తమదైన పాత్ర పోషించారు. ఏ కూటమిలో లేని కారణంగా భారాస, వైకాపా, బిజద, బీఎస్పీలు తీవ్రంగా నష్టపోయాయి.


క్షేత్ర స్థాయి పోరాటవీరుడు ఖర్గే

క్షేత్ర స్థాయి పోరాటవీరుడైన 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తేవడంలో సఫలమైనా అధికారంలోకి తేలేకపోయారు. పదవి చేపట్టిన రెండేళ్లలో ఆయన పొత్తులను కుదర్చడంలో, పార్టీకి 99 స్థానాలను సాధించడంలో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో 22 రాష్ట్రాల్లో దాదాపు 100 ర్యాలీల్లో ఖర్గే పాల్గొన్నారు. 70 మీడియా సంస్థలతో మాట్లాడారు. పార్టీలో గ్రూపు తగాదాలను అరికట్టడంలోనూ సఫలమయ్యారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు