Lok Sabha Elections: సింగం vs సింగై.. మధ్యలో గణపతి

 త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్‌ గణపతి రాజ్‌కుమార్‌, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్‌ బరిలో ఉన్నారు.

Updated : 04 Apr 2024 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ప్రత్యేకం : అన్నామలై.. ఐపీఎస్‌.. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించేవారు. కర్ణాటక కేడర్‌కు చెందిన ఈ ఐపీఎస్‌ విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండటంతో సింగంగా పేరుపొందారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు చేరువ చేస్తుందని, కానీ రాజకీయ ప్రతినిధిగా మారితే విధాన పరమైన నిర్ణయాల్లో కీలకంగా ఉంటూ ప్రజలకు మరింత సేవచేయవచ్చన్న వాస్తవాన్ని గ్రహించారు. దీంతో 2019లో ఐపీఎస్‌కు రాజీనామా చేసి తన సొంత రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అప్పటికే రాజకీయ శూన్యత ఉంది. అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత, డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి కాలం చేయడంతో ద్రవిడ రాజకీయాలను శాసించే నాయకుల కొరత ఏర్పడింది. అన్నాడీఎంకే ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలతో బలహీనపడింది. డీఎంకేలో స్టాలిన్‌ పెద్దనేతగా ఎదిగారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో స్టాలిన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు చేపట్టారు. సూటైన ప్రసంగాలు, అప్పటి వరకు ఉన్న రాజకీయవాదాన్ని తిరస్కరించడం, ప్రజలతో మమేకం కావడంతో ద్రవిడ రాజకీయ రంగంపై కొత్త నాయకుడిగా అవతరించాడు. ఎన్‌ మన్‌, ఎన్‌ మక్కళ్‌ ( నా నేల నా ప్రజలు) అన్న పేరుతో సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలోని యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి  మాజీ మేయర్‌ గణపతి రాజ్‌కుమార్‌, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్‌ బరిలో ఉన్నారు.

ఇక్కడ నుంచే ఎందుకు?

తమిళనాడును ద్రవిడ రాజకీయాలు శాసిస్తున్నాయి.  సుదీర్ఘకాలం అన్నాడీఎంకే లేదా డీఎంకేలు అధికారంలో ఉన్నాయి. అందుకనే జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు ఏదో ఒక కూటమిలో కొనసాగడం సంప్రదాయంగా మారింది. 1998, 1999 ఎన్నికల్లో ఇక్కడ నుంచి భాజపా అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఈ స్థానంలో గౌండర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అన్నామలైది అదే వర్గం కావడం గమనార్హం. పారిశ్రామికంగా కోవై దేశంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. చేనేత రంగంలో పని చేసేందుకు వేలాదిమంది ఉత్తరభారతీయులు ఇక్కడ ఉన్నారు. వీరు భాజపాకు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

ముక్కోణపు పోటీ

డీఎంకే నుంచి మాజీ మేయర్‌ గణపతి రాజ్‌కుమార్‌ పోటీచేస్తున్నారు. 1996 తరువాత ఇక్కడ డీఎంకే విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో సీటును మిత్రపక్షమైన సీపీఎంకు కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో తానే పోటీచేయాలని నిర్ణయించడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఇక అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్‌ పోటీచేస్తున్నారు. కొంగై ప్రాంతం అన్నాడీఎంకేకు కోట అని చెప్పవచ్చు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో  కోయంబత్తూర్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాల అభ్యర్థులు  గెలుపొందారు. పార్టీ ఐటీ విభాగ సారథిగా రామచంద్రన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నామలై, రామచంద్రన్‌, గణపతి విద్యాధికులు కావడం విశేషం. ఈ ప్రాంతం పూర్వం నుంచి అన్నాడీఎంకేకు అనుకూలమని ఈ  ఎన్నికల్లో సైతం విజయ పతాకం ఎగరవేస్తామని రామచంద్రన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను మేయర్‌గా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిపనులు తనను గెలిపిస్తాయని గణపతి పేర్కొంటున్నారు. అన్నామలై విజయం సాధించి దేశవ్యాప్తంగా ఎన్డీయేకు అనుకూల పవనాలు వీస్తే ఆయనకు కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అని భాజపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరి ఓటరు ఏం తీర్పు చెప్పనున్నాడో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని