YS Jagan: ఎన్నికల వేళ ‘అన్న’ను ఆడేసుకున్న సోషల్‌ మీడియా

ఏపీలో ఎన్నికల ప్రచార వేళ సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్, ఎక్స్, ఇన్‌స్టా.. ఇలా వేదిక ఏదైనా సరే ట్రోలర్స్‌ దేన్నీ వదలకుండా జగన్‌ను ఓ ఆట ఆడుకున్నారు.

Updated : 05 Jun 2024 13:54 IST

ఓటర్లను ఆలోచింపజేసిన డాక్యుమెంటరీలు

ఎన్నికల వేళ జగన్‌ మామపై ట్రోలర్స్‌.. 
మీమ్స్‌ను హోరెత్తించారు..
మాట పలికినా.. పదం తొణికినా..
ట్రోల్స్‌తో బాజా మోగించారు!
‘తగ్గేదేలే’ అంటూ దుమ్ముదులిపారు..
జనం అంతా దుమ్మెత్తిపోసేలా చేశారు.
ఇంటి కడప దాటి జనక్షేత్రంలో ప్రచారం చేయకున్నా..
మునివేళ్లతోనే సామాజిక మాధ్యమాల వేదికగా జన సునామీ సృష్టించారు..
జగన్‌ మామ ఓటమిలో భాగమయ్యారు.
ఇదీ ‘మీమ్స్‌’ మాయ..!

పీలో ఎన్నికల ప్రచార వేళ సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్, ఎక్స్, ఇన్‌స్టా.. ఇలా వేదిక ఏదైనా సరే ట్రోలర్స్‌ దేన్నీ వదలకుండా జగన్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ట్రోల్స్‌తో ‘ట్రోలు’ తీసేశారు. చురకత్తి లాంటి కామెంట్లతో ఉతికిఆరేశారు. అవినీతి పాలనపై ప్రశ్నలు సంధించారు. జగన్‌ సిద్ధం సభల్లో.. లబ్ధిదారులతో ప్రతిపక్షాలను తిట్టిస్తూ, సీఎంను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడించినా సరే.. సోషల్‌ మీడియాలో జగన్‌ను తూర్పారబడుతూ విమర్శలు గుప్పించారు. ‘బస్సుయాత్ర’లో ఎంపిక చేసిన మహిళలతో మాట్లాడినా, బస్సు వెంట పరుగులు తీసినా.. ‘‘అదంతా ఐప్యాక్‌ ప్రాయోజిత కార్యక్రమమే’ అనే స్థాయికి తీసుకొచ్చారు ట్రోలర్స్‌.

ఇవే కాదు.. జగన్‌ ప్రజావ్యతిరేక పాలనపై సామాజిక మాధ్యమాల వేదికగా విడుదలైన చిత్రాలు, లఘుచిత్రాలు కూడా ఆదరణ పొందాయి. ప్రజలకు అర్థమయ్యేలా రూపొందించిన ఈ చిత్రాలు ఓటర్లను ఆకర్షించడమే కాదు.. ఆలోచింపజేశాయి కూడా. యూట్యూబ్, సోషల్‌ మీడియాల్లో అత్యధిక వీక్షణలు నమోదవడం దీనికి నిదర్శనం.

హోరెత్తించిన ‘వివేకం’.. రాజధాని ఫైల్స్‌

జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా విడుదలైన వివేకం సినిమా 70 లక్షల వీక్షణలు పూర్తి చేసుకోవడం గమనార్హం. అమరావతిలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు, రాజధాని రైతులపై దమనకాండ నేపథ్యంలో రూపొందిన ‘రాజధాని ఫైల్స్‌’ కూడా యూట్యూబ్‌లో అధిక వీక్షణలు సొంతం చేసుకుంది. 

వైకాపా ప్రభుత్వ దోపిడీని కళ్లకు కట్టేలా

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం’ నేపథ్యంలో సినీ నటుడు పృథ్వి నటించిన టీజర్‌కు అనూహ్య స్పందన లభించింది. ‘భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం.? అయితే ఏంటి?’ అని ఆయన పలికిన మాటలు ఓటర్లను ఆలోచింపజేశాయి. ‘దివాకరం.. ది క్యాషియర్‌’ పేరుతో తెదేపా రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ బాదుడు, మద్యం పేరుతో దోపిడీని కళ్లకుకట్టింది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రాలకు పెద్దఎత్తున స్పందన లభించింది.

చంద్రబాబు అరెస్టు సమయంలో..

చంద్రబాబు అరెస్టు మొదలుకుని.. ఆయన్ను రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చి, అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లే వరకు.. సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. జగన్‌ సర్కారు తీరును ఎండగడుతూ వివిధ వేదికల ద్వారా ట్రోలర్లు విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు’ అంటూ కొన్ని క్లిప్పింగ్‌లను జతచేసి ఆయనకు అపవాదు తీసుకొచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా వైకాపా సర్కారు పన్నిన కుతంత్రాలను జనం నమ్మలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని