Uddhav Thackeray: ‘ఠాక్రే’ను దొంగిలించేందుకు భాజపా యత్నం: ఉద్ధవ్‌

మరో ఠాక్రేను దొంగిలించేందుకు భాజపా పావులు కదుపుతోందని శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. 

Updated : 20 Mar 2024 00:13 IST

ముంబయి: మహారాష్ట్రలో ఓట్లు పడాలంటే ‘ఠాక్రే’ పేరుతోనే సాధ్యమని భాజపాకి అర్థమైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)అన్నారు. అందుకే ఇప్పటికే బాల్‌ ఠాక్రే ఫొటోను దొంగిలించిన భాజపా.. మరో ‘ఠాక్రే’ని తస్కరించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో (Amit Shah) మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే భేటీపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాందేడ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్ధవ్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ పేరుతో మహారాష్ట్రలో ఓట్లు రావని భాజపాకి తెలుసన్నారు. ఠాక్రే (బాల్‌) పేరు చెబితేనే ఇక్కడి ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. అందుకే తమ కుటుంబీకుడైన రాజ్‌ ఠాక్రేకు వల వేస్తున్నారని విమర్శించారు.

‘‘ఇంతకు ముందు బాల్‌ ఠాక్రే ఫొటోను దొంగిలించారు. అయినా, ఇబ్బందేం లేదు. ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ఠాక్రేను తమవైపు లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఏం ఫర్వాలేదు. ప్రజలంతా మనవైపే ఉన్నారు. తగిన సమయం చూసి వాళ్లే బుద్ధి చెబుతారు’’ అని ఉద్ధవ్‌ అన్నారు. శివసేన అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గీయులు.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు, గుర్తుల విషయంతో తీవ్ర చర్చోపచర్చల అనంతరం శిందే వర్గానిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం గుర్తించింది.

మరోవైపు శివసేనలో అంతర్గత విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజ్‌ ఠాక్రే  2006లో ఎంఎన్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. 2008 ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ.. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబయి, షిర్డీ, నాశిక్‌ లోక్‌సభ స్థానాలను తమకు కేటాయిస్తే భాజపాతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భాజపా కూడా ఇందుకు సమ్మతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏక్‌నాథ్‌ శిందే మద్దతు ఉండటంతో.. తాజా ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్‌ కూడా మద్దతిస్తే ఠాక్రే కుటుంబ అభిమాన ఓట్లను రాబట్టుకోవచ్చని భాజపా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని