Sridhar Babu: డిసెంబరు 9నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: శ్రీధర్‌బాబు

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 

Updated : 07 Dec 2023 21:34 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ తొలి భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సాయాన్ని రూ.10లక్షల వరకు పెంపు హామీలను సోనియా పుట్టిన రోజు సందర్భంగా అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ రెండు గ్యారంటీలపై ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సీఎం చర్చిస్తారని వెల్లడించారు.  

‘‘2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు ఏ శాఖలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు.. దేనికి ఖర్చు చేశారు. వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకు చేరవయ్యాయనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా అన్ని వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరాం. ఆరు గ్యారంటీలకు సంబంధించి మంత్రివర్గ  భేటీలో సుదీర్ఘంగా చర్చించాం. ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించాం. శుక్రవారం ఆయా శాఖల అధికారులతో చర్చించి 9వ తేదీన వాటిని అమలు చేసే కార్యక్రమం చేపడతాం. దీనికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా, సాగుకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. గత తొమ్మిదేళ్లుగా విద్యుత్‌కు సంబంధించి  ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదు. గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై సమీక్షించాం. డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్‌ నియమించిన తర్వాత ... వారి చేతుల మీదుగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారు. రైతులకు పెట్టుబడి సాయంపై కేబినెట్‌లో చర్చించాం. అన్ని వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించాం. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’’ అని శ్రీధర్‌బాబు వెల్లడించారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల విషయమై కేబినెట్‌లో చర్చించామని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సీఎస్‌ ప్రారంభిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని