Bandi Sanjay: కరీంనగర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకూ.. బండి సంజయ్‌ ప్రస్థానమిదే!

భాజపాలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన బండి సంజయ్‌.. కేంద్ర సహాయ మంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు.

Published : 10 Jun 2024 05:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భాజపాలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. రాజకీయంగా దూకుడుగా వెళ్లడం.. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉండటం.. ముఖ్యంగా సంఘ్‌ ఆశీస్సులతో పాటు తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వంటి అంశాలు మోదీ 3.0 జట్టులో చోటుదక్కించుకొనేందుకు ఆయనకు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి.

ఎమ్మెల్యేగా ఓడినా.. ఎంపీగా బంపర్‌ విజయం

2018, 2023లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ను ఓటమి పలకరించినా.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయాలను నమోదు చేశారు. తన రాజకీయ ప్రయాణం మొదలైన తొలినాళ్లలో సంజయ్‌.. ది కరీంనగర్‌ అర్బన్‌ సహకార బ్యాంకు డైరెక్టర్‌గా 1994, 1999లో గెలుపొందారు. 2006, 2013లో కరీంనగర్‌ నగర పాలక సంస్థలో 48వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా సేవలందించారు. కరీంనగర్‌ నగర భాజపా అధ్యక్షుడిగా ఉంటూ 2014 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి 52 వేల పైచిలుకు ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2018లోనూ దాదాపు అదే పరిస్థితి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా సంచలన విజయం నమోదు చేసిన సంజయ్‌.. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీలో ఊపు తీసుకొచ్చారు. 2023 శాసనసభ ఎన్నికలు జరిగే నాటికి సంజయ్‌ అధ్యక్ష స్థానం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు మారారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ 2.25లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో అపూర్వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

స్వయంసేవక్‌ నుంచి..

కరీంనగర్‌కు చెందిన బండి సంజయ్‌ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా ఉన్నారు. సరస్వతీ శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన తొలి నుంచి హిందూత్వ బాటలోనే నడిచారు. 1992లో అయోధ్య కరసేవకుడిగా పని చేసిన ఆయన ఎల్‌.కె.అడ్వాణీ సురాజ్‌ రథయాత్ర సమయంలో వాహన బాధ్యుడిగా సేవలు అందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పనుల నిమిత్తం దిల్లీకి వచ్చిన తొలినాళ్లలో ఆయనకు సహాయకులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వ్యవహరించారు. దిల్లీలో భాజపా కార్యాలయ ఇన్‌ఛార్జిగా... పార్టీ ప్రచార ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా.. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్న సమయంలో కేరళ, తమిళనాడు ఇన్‌ఛార్జిగానూ పని చేశారు. 2020 మార్చిలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌.. 2023 జులై వరకు కొనసాగారు. ఈ సమయంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. జులైలో పార్టీ అధిష్ఠానం ఆయన్ను రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తప్పించి.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 

కుటుంబ నేపథ్యం

  • పూర్తి పేరు : బండి సంజయ్‌ కుమార్‌
  • పుట్టిన తేదీ: 11, జులై 1971
  • తల్లిదండ్రులు: బండి నర్సయ్య, శకుంతల
  •  కుటుంబం: భార్య... అపర్ణ (ఎస్‌బీఐ అధికారిణి), కుమారులు సాయి భగీరత్‌, సాయి సుముఖ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు