Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్‌రెడ్డి

కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 04 Dec 2023 21:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క భాజపాకే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 14 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే తమ ఓటు బ్యాంక్‌ 100 శాతం పెరిగింది. 8 స్థానాల్లో విజయం సాధించాం. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తాం. కాంగ్రెస్, భారాస పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేశాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఇవ్వలేదు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించాం.

వెంకట రమణారెడ్డి ఐదేళ్ల పోరాటమే ఈ ఫలితాన్ని ఇచ్చింది. కామారెడ్డి ఫలితం పట్ల జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారు. నిరాశను దరి చేరనీయకుండా పట్టుదలతో మా లక్ష్యం కోసం ముందుకు సాగుతాం. అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తాం. వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తాం. కేంద్రం, భాజపాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఇవాళ దిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి అన్ని విషయాలు వివరిస్తా. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించేవి. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరి సహాయం తీసుకుంటాం’’ అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని