Akhilesh Yadav: యూపీలో మా లక్ష్యం సాధించాం: అఖిలేశ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలదళాన్ని అడ్డుకోవాలనే లక్ష్యసాధనలో ‘సమాజ్‌వాదీలు’ విజయం సాధించినట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.

Updated : 06 Jun 2024 06:12 IST

కన్నౌజ్, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలదళాన్ని అడ్డుకోవాలనే లక్ష్యసాధనలో ‘సమాజ్‌వాదీలు’ విజయం సాధించినట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆకట్టుకునే ప్రదర్శన కనబరచిన ఎస్పీ.. భాజపా ఆశలపై నీళ్లు చల్లింది. కన్నౌజ్‌ నుంచి ఎంపీగా గెలిచిన ధ్రువపత్రం అందుకొన్న అనంతరం బుధవారం మీడియాతో అఖిలేశ్‌ మాట్లాడారు. ‘‘సకారాత్మక రాజకీయాలకు మద్దతుగా నిలిచి, సమాజ్‌వాదీలకు మరో అవకాశం ఇచ్చిన కన్నౌజ్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ పోరాటంలో భాజపాను నిలువరించాలనే మా లక్ష్యం పూర్తయింది. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంసింగ్‌ యాదవ్‌ మార్గాన్ని అనుసరించి యూపీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో 37 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించాం’’ అన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ప్రజాస్వామ్యాన్ని రక్షించి.. నకారాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నవారిని తొలగించాలని ప్రజలు తమకు ఓటేసినట్లు అఖిలేశ్‌ తెలిపారు. 

ముస్లింలు మమ్మల్ని అర్థం చేసుకోలేదు : మాయావతి

లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ప్రదర్శన అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బుధవారం ఓ ప్రకటన చేస్తూ.. పార్టీపరంగా తమ ప్రయత్నలోపం లేకున్నా, ముస్లిం సమాజం బీఎస్పీని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందన్నారు. మునుముందు బాగా ఆలోచించిన తర్వాతే ఆ వర్గానికి పార్టీపరంగా ఎన్నికల అవకాశాలు కల్పిస్తామన్నారు. తాజా ఎన్నికల్లో గరిష్ఠంగా 35 మంది ముస్లింలకు తాము టికెట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ఓటమిపై లోతైన విశ్లేషణ చేసి, పార్టీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఎస్పీకి అండగా నిలిచిన దళితులు, ముఖ్యంగా జాటవ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని