Uttar Pradesh : మీ మంత్రి సనాతన ధర్మాన్ని అవమానించాడు : కాంగ్రెస్‌

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్ర మంత్రి ఒకరు శివలింగం వద్ద చేయి కడుక్కున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సనాతన ధర్మాన్ని అవమానించిన ఆ మంత్రిని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) తక్షణమే బర్తరఫ్‌ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. 

Updated : 04 Sep 2023 19:57 IST

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర (Uttar Pradesh)  మంత్రి సతీశ్‌ శర్మ శివలింగం వద్ద చేయి కడుక్కున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ (Congress) ఓ వీడియోను విడుదల చేసింది. సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పే భాజపా నేతలు చేసే పని ఇది అంటూ సోషల్‌ మీడియాలో దాన్ని వైరల్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 27న మంత్రులు సతీశ్‌శర్మ, జితిన్‌ ప్రసాద రామ్‌నగర్‌ తహశీల్‌ పరిధిలోని హెత్మాపుర్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం లోధేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం సతీశ్‌ శర్మ చేతులకు ప్రసాదం ఉండటంతో ఆలయ పూజారి ఆదిత్య తివారి కడుక్కోవటానికి నీరు పోశారు. ఆ చర్య శివలింగం సమీపంలోనే జరగడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ నాయకులు విమర్శలు గుప్పించారు. 

ఏఐసీసీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: రేవంత్‌ రెడ్డి

‘ఏం చేస్తున్నాడో ఆ మంత్రికే తెలియాలి. జలాభిషేకం నిర్వహించే చోట చేతులు కడుక్కోవడమా? మంత్రి సనాతన ధర్మాన్ని అవమానించారని’ యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ విమర్శించారు. మరో నేత సురేంద్ర రాజ్‌పుత్‌ మాట్లాడుతూ మంత్రి సతీశ్‌ శర్మ పరమ శివుణ్ని అవమానించారని, వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. శివలింగం సమీపంలో చేతులు కడుక్కోవడం కచ్చితంగా అధర్మమేనని అన్నారు. మతోన్మాద చర్యకు పాల్పడిన మంత్రిని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తక్షణమే బర్తరఫ్‌ చేయాలన్నారు.

ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి ఈ పని చేస్తే భాజపా ఎప్పుడో బహిష్కరించేదని సమాజ్‌వాదీ నేత సునీల్ సింగ్‌ సాజన్‌ వ్యాఖ్యానించారు. మొదట మతం పేరుతో ఓట్లడిగి.. ఆ తర్వాత ఇలాంటి పనులు చేయడం భాజపా అసలు స్వరూపమని విమర్శించారు. అయితే.. ప్రతిపక్షాలు అనవసరంగా తనపై బురద చల్లుతున్నాయని మంత్రి సతీశ్‌ శర్మ అన్నారు. సనాతన శివ భక్తుడినైన తనకు ఏది తప్పో.. ఏది ఒప్పో తెలుసన్నారు. ఒక వేళ ఆ చర్య తప్పయితే పూజారి నీరు పోసేవారు కాదన్నారు. కాగా.. మంత్రి చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని ఆలయ పూజారి ఆదిత్య తివారి చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని