Sonia Gandhi: జూన్‌ 4 వరకు ఆగండి.. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు తారుమారే: సోనియాగాంధీ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) స్పందించారు. ఎన్నికల ఫలితాలు వాటికి విరుద్ధంగా ఉంటాయని అన్నారు. 

Published : 03 Jun 2024 13:12 IST

దిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఆశాభావం వ్యక్తంచేశారు. అందుకోసం జూన్ 4 వరకు వేచిచూద్దామంటూ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఎన్డీయే కూటమిదేనని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించిన వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘‘ఎన్నికల ఫలితాలపై మేం ఆశాభావంతో ఉన్నాం. జూన్‌ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నాం. ఆరోజు వరకు వేచి చూద్దాం’’ అని సోనియా (Sonia Gandhi) అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘ఇండియా కూటమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బోగస్‌ పోల్స్‌ను మోదీ ప్రచారంలోకి తెచ్చారు. ఇవి ఆయన ఊహల ఫలితాలు. మాకు 295 సీట్లు వస్తాయి’’ అని అన్నారు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ రాజకీయ అభిప్రాయాలే గానీ నిపుణుల ఫలితాలు కావు. నిజాలేమిటనేది 4న తెలుస్తుంది’’ అని హస్తం నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఊహల ప్రపంచంలో జీవించే వ్యక్తి అలాగే మాట్లాడతారు. అసలు ఎగ్జిట్‌ పోల్స్ ఎలా రూపొందిస్తారో తెలియని రాహుల్‌ గాంధీ.. ఫాంటసీ హాలిడేకు వెళ్లే సమయం వచ్చింది’’ అని ఎద్దేవా చేశారు. ఆశాభావంతో ఉండటం మంచిదే అయితే, ప్రధాని మోదీకి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టలేరన్నారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించడం లాంఛనమేనని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన నేపథ్యంలో సోనియా నుంచి స్పందన వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని