Rahul Gandhi: వయనాడా.. రాయ్‌బరేలీయా!

సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (వయనాడ్, రాయ్‌బరేలీ) గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రస్తుతం ఓ చిక్కుప్రశ్న ఎదుర్కొంటున్నారు.

Updated : 06 Jun 2024 06:16 IST

రాహుల్‌ వదులుకునే సీటేది? 
కాంగ్రెస్‌ అగ్రనేత నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (వయనాడ్, రాయ్‌బరేలీ) గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రస్తుతం ఓ చిక్కుప్రశ్న ఎదుర్కొంటున్నారు. ఈ రెండు స్థానాల్లో దేన్ని వదులుకోవాలన్నదే ఆ ప్రశ్న. రెండుచోట్లా ఆయన 3 లక్షల ఓట్లకుపైగా ఆధిక్యంతో విజయం సాధించారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? తమ కుటుంబానికి కంచుకోటలాంటి రాయ్‌బరేలీకి పరిమితమవుతారా? లేదంటే తనకు ఆపన్నహస్తం అందించిన వయనాడ్‌ నుంచి కొనసాగుతారా? ఈ ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. 

వయనాడ్‌: మైనారిటీ ఓట్లు ఎక్కువ

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో రెండు ఎస్టీ రిజర్వుడు సీట్లు. ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. వయనాడ్‌ నియోజకవర్గంలో క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పంటలకు మద్దతు ధర, గిరిజనుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల లేమి వంటివి ప్రధాన సమస్యలు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఇక్కడ బలంగా ఉంది. తాజా ఎన్నికల్లో రాహుల్‌పై భాజపా తమ పార్టీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ను, సీపీఐ అన్నీ రాజాను బరిలో దింపాయి. వారిద్దరూ బలమైన నేతలే. రాహుల్‌ ఉత్తరాది నుంచి మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారని, అక్కడ గెలిస్తే ఆ స్థానానికే వెళ్లిపోతారని వారు తమ ప్రచారంలో పదేపదే పేర్కొన్నారు. అయితే- విపక్ష ఇండియా కూటమి తరఫున రాహుల్‌ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు చేసిన ప్రచారంతోపాటు గత అయిదేళ్లలో స్థానికంగా చేసిన అభివృద్ధి పనులు రాహుల్‌ను విజయతీరాలకు చేర్చాయి. 2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో ఓడిపోయిన రాహుల్‌.. వయనాడ్‌లో గెలిచి ఊపిరి పీల్చుకున్న సంగతి గమనార్హం. 


రాయ్‌బరేలీలో ప్రియాంకను దించుతారా? 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు, గాంధీ కుటుంబానికి కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో మూడుసార్లు మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. తన తల్లి సోనియాగాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన  రాయ్‌బరేలీ స్థానంలో రాహుల్‌ బరిలో దిగి భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. ఆయన ఈ సీటును వదులుకుంటే.. ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో మరే నియోజకవర్గం నుంచీ బరిలో దింపలేదనే వాదనా ఉంది. ఈ విషయాన్ని గతంలో పరోక్షంగా ప్రస్తావించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోదీ అసత్యాలను ఎండగడుతున్నందున ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె రాయ్‌బరేలీ బరిలో దిగడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని