Congress: కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: మల్లు రవి

భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ప్రశ్నించారు. 

Published : 25 May 2024 15:51 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ కళాశాల వారే పట్టభద్రులు.. మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడటం సరి కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పట్టభద్రులపై భారాస వైఖరి ఏంటో వారి మాటల్లోనే తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. కాబట్టి కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి. ఆ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ వస్తున్నారు. ఆమెను ఘనంగా సన్మానిస్తాం. తెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆ పార్టీలన్నీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచాక కాంగ్రెస్ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళల గురించి తన గొంతు వినిపిస్తారు’’ అని మల్లు రవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు