Rahul Gandhi: ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ రూ.1,823 కోట్లు చెల్లించాలని పార్టీకి ఐటీ నోటీసు రావడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. 

Published : 29 Mar 2024 19:24 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు రావడంపై  పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ఇలాంటి కుట్రలు పన్నుతోందని మండిపడింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు ఐటీ రూ.1,823 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.  తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలని పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఐటీ శాఖ నుంచి వచ్చిన తాజా నోటీసులపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఈడీ, ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు భాజపా ఆదేశాల మేరకే పని చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మళ్లీ  ఇలా చేయడానికి ఎవరూ ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

పన్ను డిమాండ్లు రద్దు చేసేందుకు సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భాజపా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్నును కూడా లెక్కించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను అధికారులు కాంగ్రెస్‌కు రూ.200 కోట్ల జరిమానా విధించి నిధులను స్తంభింపజేయడంతో పార్టీ ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటోంది. హైకోర్టుకు వెళ్లినా ఉపశమనం దొరకలేదు. దీంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని