YS Jagan: ఏం జరిగిందో దేవుడికే ఎరుక

‘ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో మోసం చేశారనో, ఎవరో అన్యాయం చేశారనో అనొచ్చు. కానీ వాటికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. నేను చేయగలిగేదేమీ లేదు’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 05 Jun 2024 07:41 IST

ఎవరో మోసం, అన్యాయం చేశారనడానికి ఆధారాల్లేవు
ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు
పథకాల ప్రభావం ఏమైందో తెలియదు
ప్రజల తీర్పును స్వీకరిస్తున్నాం 
ఎన్డీయే నేతలకు శుభాకాంక్షలు
ఫలితాల అనంతరం సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో మోసం చేశారనో, ఎవరో అన్యాయం చేశారనో అనొచ్చు. కానీ వాటికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. నేను చేయగలిగేదేమీ లేదు’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపికచేసిన కొంతమంది విలేకరులతో జగన్‌ మాట్లాడారు. ‘అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు, మంచిచేసి వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మేలుచేసి, సాయాన్ని వారి ఇంటికే పంపే వ్యవస్థను తీసుకొచ్చినా, వాళ్లు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు. 1.05 కోట్ల మంది పొదుపు సంఘాల మహిళలకు అన్నివిధాలా అండగా ఉన్నాం. వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. చేయూత అందుకుంటున్న 26 లక్షల మంది మహిళల ఆప్యాయత ఏమైందో తెలియదు. 12 లక్షల మంది పిల్లల చదువులకు పూర్తి ఫీజులు చెల్లించినా, వారి తల్లిదండ్రుల అభిమానం ఏమైందో తెలియదు.

54 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనట్లుగా పెట్టుబడి సాయం అందింది. రైతు భరోసా, సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి, పంట బీమా కల్పించి, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చినా.. వారి ప్రేమ ఏమైందో తెలియదు. వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరు వ్యాపారులకు తోడు, రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు చేదోడు.. ఇలా కోట్ల మంది పేదలకు తోడుగా ఉన్నాం. మ్యానిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్‌ కాదు, బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశాం. పిల్లలకు ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చి వారి చరిత్ర మార్చాలని చూశాం. గ్రామస్థాయిలో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఇంటికీ వివక్ష, అవినీతి లేకుండా సేవలందించాం. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చి, పేదలకు అండగా నిలబడ్డాం. మహిళా సాధికారిత, సామాజిక న్యాయమంటే ఏంటో ప్రపంచానికి చూపించాం. ఇంత గొప్ప మార్పులు చేశాక.. వారి అభిమానం, ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని జగన్‌ పేర్కొన్నారు.

పోరాటాలు చేయడం కొత్తకాదు

‘మంచి చేయడానికి కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. గొంతులేని వారికి గొంతుక (వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌)గా ఈ పార్టీ తాను చేయాల్సింది తప్పకుండా చేస్తుంది. ఎంతచేసినా 40 శాతం మా ఓటుబ్యాంక్‌ను తగ్గించలేకపోయారు. కచ్చితంగా మళ్లీ గుండె ధైర్యంతో ఇక్కడి నుంచే లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం, పోరాడటం కొత్తకాదు. ఈ అయిదేళ్లు తప్ప, నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను అనుభవించా. ఇప్పుడు అంతకంటే కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం. ఓడిపోయినా సరే, నా కష్టాల్లో అండగా నిలబడిన ప్రతి నాయకుడు, కార్యకర్త, వాలంటీరుకు, ప్రతిఇంటి నుంచి స్టార్‌ క్యాంపెయినర్లుగా తోడుగా నిలిచిన అక్క చెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని జగన్‌ తెలిపారు.

గొప్ప విజయానికి అభినందనలు

పెద్దపెద్ద వాళ్ల కూటమి, దిల్లీలో సైతం శాసించే పరిస్థితిలో ఉన్న కూటమి, అందులో ఉన్న భాజపా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమావేశం చివర్లో మీ కొత్త పాత్ర ఎలా ఉండబోతోంది అని విలేకరులు ప్రశ్నించగా, జగన్‌ బదులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. మరోపక్క ‘ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తరఫున పోరాడతాం. కచ్చితంగా మళ్లీ తిరిగి లేస్తామ’ని జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.


సీఎం జగన్‌.. మంత్రుల రాజీనామా

ఆమోదించిన గవర్నర్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ఆయన మంత్రి వర్గంలోని 24 మంది మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. వీటిని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు పంపగా.. ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని జగన్‌ను గవర్నర్‌ కోరారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి 11 గంటల తరువాత రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం రాజపత్రం (గెజిట్‌) విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని