Priyanka Gandhi: రావణుడితో పోరాడినప్పుడు రాముడికీ అధికారం లేదు: ప్రియాంక

ఆనాడు ధర్మం కోసం రావణుడితో యుద్ధం చేసిన రాముడికి కూడా అధికారం లేదని, ఇప్పుడు భాజపాపై పోరాడేందుకు ఇండియా కూటమికి కూడా అవసరం లేదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అన్నారు.

Published : 01 Apr 2024 00:05 IST

దిల్లీ: రాముడు సత్యం, ధర్మం కోసం పోరాడినప్పుడు అతడి చేతిలో అధికారం లేదని, రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రథమైనా లేదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. రామ భక్తులుగా చెప్పుకొనే నేటి అధికార పార్టీ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తించేందుకు ఆయన జీవితమే ఉదాహరణ అని చెప్పారు. దిల్లీలోని (Delhi) రామ్‌లీలా మైదానంలో (Ram Leela Maidan) ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ (India bloc)నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రామాయణ ఇతిహాసంలోని కొన్ని ఘట్టాలను ఉటంకిస్తూ అధికార భాజపాపై విమర్శలు గుప్పించారు. 

చిన్నతనంలో తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి ఎన్నోసార్లు రామ్‌లీలా మైదానానికి వచ్చానని గుర్తు చేసుకున్న ప్రియాంక.. ఇక్కడ ప్రతియేటా నిర్వహించే రావణ దహనానికి హాజరైనప్పుడు ఆమె రామాయణం గురించి చెప్పేవారని అన్నారు. ‘‘ వేలాది సంవత్సరాల క్రితమే ఎలాంటి అధికారం, ఆయుధాలు లేకపోయినా రాముడు సత్యం, ధర్మం కోసం కోసం రావణుడిపై యుద్ధం ప్రకటించి విజయం సాధించాడు. ప్రస్తుతం ఇండియా కూటమి కూడా.. ధర్మం కోసమే పోరాటం చేస్తోంది. అది మనవైపే ఉంది. విజయం తప్పక వరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ప్రియాంక అన్నారు.

అన్ని పార్టీలను ఎన్నికల సంఘం సమాన దృష్టితో చూడాలని ఆమె కోరారు. అప్రజాస్వామిక అడ్డంకులను తొలగించి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను నిలిపివేసేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని