Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు

భారత ప్రధానిగా ఈ నెల 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు.

Updated : 08 Jun 2024 05:12 IST

 ఇప్పటికే పలువురు దేశాధినేతలకు ఆహ్వానాలు
పార్లమెంటు నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకూ..

దిల్లీ, కాఠ్‌మాండూ, మాలే: భారత ప్రధానిగా ఈ నెల 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్‌ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధానమంత్రి షెరింగ్‌ టాబ్గే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్, సీషెల్స్‌ అధ్యక్షుడు వావెల్‌ రామ్‌కలావాన్‌ తదితరులకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే నేపాల్‌ ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ) ఆదివారం నుంచి మూడు రోజుల భారత్‌ పర్యటనకు వస్తున్నారు. ఆయన 9న జరిగే మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం ఆయన తిరిగి నేపాల్‌కు బయలుదేరతారు. 

ముయిజ్జు హాజరవుతారు!

భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు హాజరవుతారని ఎడిషన్‌.ఎంవీ అనే న్యూస్‌ పోర్టల్‌ తెలిపింది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఏదీ వెల్లడికాలేదు. ప్రధానమంత్రి మోదీకి బుధవారం ముయిజ్జు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత ప్రధానితో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు