Modi 3.0 Cabinet: క్యాబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఎన్డీయే తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు.

Updated : 07 Jun 2024 06:48 IST

9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం!
నేడు ఎన్డీయే ఎంపీల భేటీ
తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ
హోం, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే!
3 బెర్తులు దక్కొచ్చంటున్న తెదేపా వర్గాలు
బిహార్‌కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ?
ఈనాడు - దిల్లీ

ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఎన్డీయే తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం రాత్రే హస్తిన చేరుకున్నారు. ఎన్డీయే ఎంపీల భేటీలో 240 మంది భాజపా ఎంపీలతోపాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్‌ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే. 

ఆదివారం సాయంత్రం 6గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది. 

మంత్రి పదవుల కేటాయింపు ఎలా? 

రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. అంటే- ప్రస్తుతం 81 మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం భాజపాకు సొంతంగా లేదు. కాబట్టి గత రెండు దఫాలతో పోలిస్తే మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా? లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గత రెండు పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహారశుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలనే భాజపా కేటాయించింది.  గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. మరోవైపు టాప్‌-4గా చెప్పుకొనే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను భాజపా తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్రమంత్రివర్గం కొత్తవారితో సరికొత్త రూపు సంతరించుకొనే అవకాశముంది. శివసేన (శిందే వర్గం) తరఫున తన కుమారుడు, మూడుసార్లు ఎంపీ శ్రీకాంత్‌ శిందేను కాకుండా ఇతర సీనియర్‌ ఎంపీలను మంత్రి పదవుల కోసం పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే భాజపాకు సూచించినట్లు సమాచారం. 

రాష్ట్ర ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట 

ప్రస్తుతం ఎన్డీయేలో భాజపా తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్నది తెదేపాకే. ఆ పార్టీ సభ్యులకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలున్నాయి. అయితే చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని తెదేపా వర్గాలు గుర్తుచేస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని పేర్కొంటున్నాయి. గతంలో తెదేపా వాజ్‌పేయీ ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్‌ పదవికే పరిమితమైన విషయాన్నీ గుర్తుచేస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం 2014-18 మధ్య మోదీ చూశారని, ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా భాజపా నేతలు ఆ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారని తెదేపా నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు మరోసారి అదే పంథాను అనుసరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆయన అమరావతి, పోలవరం నిర్మాణంతోపాటు రాష్ట్రానికి మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయడానికి వెనుకాడబోరని వివరిస్తున్నారు. అందుకే మంత్రి పదవుల కోసం తన అమ్ములపొదిలోని అస్త్రాలను వృథా చేసుకోరని చెబుతున్నారు. తెదేపాకున్న సంఖ్యాబలాన్ని బట్టి మూడు దాకా మంత్రి పదవులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు- బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపాను జేడీయూ డిమాండ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భాజపా అగ్రనేతల భేటీ 

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర భాజపా అగ్రనేతలు దిల్లీలో గురువారం తమ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇంట్లో సమావేశమయ్యారు. మిత్రపక్షాలకు కేంద్ర మంత్రి పదవుల పంపకంపై సమాలోచనలు జరిపారు. స్వపక్షంలో ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలన్నదానిపై చర్చించారు. బి.ఎల్‌.సంతోష్, సురేష్‌ సోని, అరుణ్‌కుమార్, దత్తాత్రేయ హొసబళె తదితర నేతలూ ఇందులో పాల్గొన్నారు.


మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయనున్న వివిధ దేశాల అధినేతలు!

మోదీ ప్రమాణస్వీకార వేడుకకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్‌ల పాలకులు ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమానికి తరలివచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ఇప్పటికే తమ రాకను ఖరారు చేసినట్లు పేర్కొన్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని