BJP: కమలం ప్రయోగం వికటించిందా..?

2024 ఎన్నికలు భాజపాకు అతిపెద్ద షాక్‌గా నిలిచాయి. 2004 నాటి ఫలితాలు పునరావృతం కాకపోయినా.. ఆ పార్టీ పార్లమెంట్‌లో సొంతంగా మెజార్టీని కోల్పోయి కూటమి పక్షాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో భారీగా నష్టపోవడం అవకాశాలను దెబ్బతీసింది.

Published : 05 Jun 2024 00:13 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా భాజపా 370 సీట్లు సాధిస్తుందని చెప్పిన ఆ పార్టీకి ఇప్పుడు చుక్కెదురైంది. గతం కంటే కనీసం 60కిపైగా సీట్లు తక్కువ వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ (80), పశ్చిమ బెంగాల్‌ (42) మహారాష్ట్ర (48), కర్ణాటక (28), బిహార్‌ (39), రాజస్థాన్‌ (25) రాష్ట్రాల్లో గతం కంటే సీట్లను కోల్పోయింది. ఒడిశాలో రాణించినా.. తమిళనాడులో అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఫలితంగా భాజపా సొంతంగా మెజార్టీ సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈమేరకు ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు 99, సమాజ్‌వాదీ పార్టీకి 36 సీట్లతో భారీగా లబ్ధి చేకూరింది.

అభ్యర్థుల ఎంపికలో తప్పు జరిగిందా..?

ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకొనేందుకు ఏకంగా 112 మంది సిట్టింగ్‌లకు టికెట్లను నిరాకరించింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకూ మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చేసింది. టికెట్లు కోల్పోయిన వారి సగటు గెలుపు మెజార్టీ 2,35,111లు కాగా.. కొనసాగించిన 168 మంది సగటు మెజార్టీ 2,23,686 ఓట్లు కావడం విశేషం. ఫలితాలను చూస్తే భాజపా బలమైన అభ్యర్థులను వదులుకొందా అనే సందేహం రాకమానదు. బీఫారం కోల్పోయిన వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయరన్న గ్యారెంటీ లేదు. రాహుల్‌ కస్వా వంటి వారు దీనికి ఉదాహరణ.

కూటమిలో అతిపెద్ద నష్టం భాజపాకే..

కమలం పార్టీ ఈసారి 441 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్‌డీఏ మిత్రపక్షాలు మొత్తం 540 సీట్లలో పోటీ చేశాయి. ఈ కూటమిలో అత్యధికంగా భాజపానే 2019తో పోలిస్తే 20శాతానికి పైగా సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లను సాధించిన కమలం పార్టీ ఈసారి సొంత మెజార్టీకి దిగువనే సర్దుకోవాల్సి వచ్చింది. కూటమిలోకి తిరిగి పునరాగమనం చేసిన తెదేపా గతంతో పోలిస్తే అదనంగా 12 సీట్లు లబ్ధి పొందింది.

హిందీ బెల్ట్‌లో గతి తప్పి..

దేశ వ్యాప్తంగా అత్యధిక సీట్లున్న పెద్ద రాష్ట్రాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మినహా, యూపీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతింది. ఇది మొత్తంగా భాజపా సీట్ల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపింది. యూపీలో 2019లో 64 సీట్లను గెలుచుకోగా.. ఈసారి దాదాపు 30 స్థానాలను కోల్పోయింది. 

* ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో భాజపా విజయం సాధించిన రాజస్థాన్‌లో పార్లమెంట్‌కు వచ్చేసరికి దాదాపు భారీగా సిట్టింగ్‌ సీట్లు పార్టీ కోల్పోయింది. 2019లో ఇక్కడ క్లీన్‌ స్వీప్‌ చేసిన కమలదళం ఈసారి 14కు పరిమితమైంది. 

* ఇక మరో పెద్ద రాష్ట్రమైన బిహార్‌లో గత ఎన్నికల్లో ఎన్‌డీఏ సాధించిన 39 సీట్లలో ఒంటరిగా 17 భాజపానే సాధించింది. కానీ, ఈసారి కమలం పార్టీకి 5 తగ్గి 12 సీట్లకు పడిపోగా.. మిత్రపక్షమైన జేడీఎస్‌ (ఎస్‌)కు కూడా రెండు స్థానాల్లో నష్టం చేకూరింది. మొత్తం మీద ఇక్కడ కూటమి 30 స్థానాలు సాధించింది.

దీదీ అడ్డాలో కూడా ఎదురుదెబ్బే..

భాజపా ఈసారి గణనీయంగా పుంజుకొంటుందని భావించిన పశ్చిమబెంగాల్‌లో కూడా కమలం పార్టీ కనీసం 6 సీట్లను కోల్పోయింది. గతంలో 18చోట్ల గెలవగా.. ఈ సారి 12తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా ఒక సీటు కోల్పోయింది. ఇవి మొత్తం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి.

కన్నడనాట ఆధిక్యం కోల్పోయి..

భాజపాకు దక్షిణాదిన బలమైన పట్టున్న రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ మొత్తం 28 సీట్లుండగా.. గతంలో ఎన్‌డీఏ 26 గెలుచుకొంది. ఇటీవల జేడీఎస్‌ కూడా చేరడంతో ఆ బలం 27కు పెరిగింది. కానీ, 2024 ఎన్నికల ఫలితాల్లో మాత్రం భాజపా మిత్రపక్షాల బలం 19కే పరిమితమైంది. మిత్రపక్షమైన జేడీఎస్‌ గతంలో కంటే ఒక సీటు అదనంగా గెలుచుకోవడమే ఇక్కడ ఊరట. 

మహారాష్ట్రలో ముడుచుకుపోయిన కమలం.. 

మహారాష్ట్రలో కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎన్‌డీఏ తీవ్రంగా దెబ్బతింది. 2019లో అక్కడ 41 సీట్లలో కూటమి విజయం సాధించింది. వీటిల్లో భాజపాకు 23.. శివసేనకు 18 స్థానాలు వచ్చాయి. కానీ, ఈసారి చీలిన పార్టీలతో కూటమి కట్టి.. 18 వద్దే ఆగిపోయింది.  

హరియాణాలో సగానికి సగం..

2019 ఎన్నికల్లో హరియాణాలో 10 స్థానాల్లో భాజపా క్లీన్‌స్వీప్‌ చేయగా.. ఈసారి మాత్రం బలం 5కు పడిపోయింది. ఇక్కడ హస్తం భారీగా పుంజుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని