Varanasi: మోదీపై పోటీకి కాంగ్రెస్‌ అజయ్‌నే ఎందుకు ఎంచుకుంది..!

వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ మరోసారి అజయ్‌ రాయ్‌ను బరిలోకి దించింది. ఈ ఎన్నిక కోసం అతడిని సుదీర్ఘ కాలంగా పార్టీ సిద్ధం చేస్తోంది. 

Updated : 24 Mar 2024 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక పోరు జరగనున్న లోక్‌ సభ స్థానాల్లో ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేస్తున్న వారణాసి (Varanasi) ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడి నుంచి పూర్వాంచల్‌లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్‌రాయ్‌ను కాంగ్రెస్‌ ప్రకటించింది. దీని వెనుక హస్తం పార్టీ భారీ కసరత్తు చేసింది.

గత రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, ప్రధాని మోదీ చేతిలో ఆయన ఓడిపోయారు. హస్తం పార్టీ రాయ్‌నే నమ్ముకోవడానికి ఆయన సామాజిక వర్గం కూడా ఓ బలమైన కారణంగా నిలిచింది. భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో చాలా చోట్ల ఓట్లను ప్రభావితం చేయగలరు. ఒకప్పుడు పూర్వాంచల్‌ ప్రాంతం కాంగ్రెస్‌కు బలమైన కోటలా ఉండేది. ఇక్కడ మోదీ అడుగుపెట్టడంతో ఆ పార్టీ పునాదులు కదిలాయి. మరోవైపు యూపీ సీఎం యోగి కూడా ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీ బరిలోకి దిగారు.

మరోవైపు మోదీని ఎదుర్కొనే క్రమంలో రాయ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కొన్నాళ్ల క్రితం నుంచే కాంగ్రెస్‌ చర్యలు మొదలుపెట్టింది. యూపీ పీసీసీ చీఫ్‌ బ్రిజ్‌లాల్‌ ఖబ్రీపై అసంతృప్తితో ఉన్న ప్రియాంక గాంధీ బృందం ఆయనను తప్పించి.. పీసీసీ పగ్గాలను రాయ్‌ చేతికి ఇచ్చింది. దీంతో పార్టీ క్షేత్రస్థాయి ఓటర్లకు మరింత దగ్గరైందని నాయకులు అంచనా వేశారు. దీనికి తోడు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు ఇండియా బ్లాక్‌ కింద జట్టు కట్టాయి. భారత్‌ జోడో, న్యాయ్‌ యాత్ర సమయంలో కూడా రాయ్‌ పనితీరు ఆకట్టుకుంది. దీంతో ఈ సారి కూడా మోదీపై పోరుకు రాయ్‌ పేరునే కాంగ్రెస్‌ ఎంచుకుంది.

సుదీర్ఘ అనుభవం..

ఏబీవీపీ, సంఘ్‌ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాయ్‌కు ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీటిల్లో ఒక సారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున.. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తాజాగా మోదీపై పోటీకి మూడోసారి సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని