Loksabha Elections: భాజపాకి 303 సీట్లు నిలవాలంటే ఇదే కీలకం!

గతంలో సాధించిన 303 కంటే ఎక్కువ స్థానాలు సాధించాలని భాజపా తీవ్రంగా కృషి చేసింది. ఇది నెరవేరాలంటే చివరి దశ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. ఎందుకో తెలుసా?

Updated : 31 May 2024 18:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. శనివారం ఏడోవిడత పోలింగ్‌తో ఓటింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 1న 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. గతంలో సాధించిన 303 స్థానాల రికార్డును బ్రేక్‌ చేయాలని భాజపా ఈసారి తీవ్రంగా ప్రయత్నించింది. ఇది నెరవేరాలంటే చివరి దశ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. ఎందుకో తెలుసా?

చివరి విడతకు ముందే విజయం

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 353 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో భాజపా గెలుపొందిన స్థానాలు 303. భాజపా లక్ష్యం నెరవేరాలంటే ఇంతకంటే ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిస్తే.. తొలి ఆరు దశల్లో ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో భాజపా 278 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే.. ఇంకోవిడత పోలింగ్‌ మిగిలుండగానే.. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 272 కంటే 6 స్థానాలను ఎక్కువగా సాధించింది. తొలి ఐదు విడతల్లో 238 సీట్లు రాగా.. ఆరోవిడతో మరో 40 స్థానాలు తన ఖాతాలో చేరాయి. కానీ, చివరిదశలో మాత్రం భాజపా బోల్తా పడింది.

చివరివిడతలో 25 సీట్లే..

2019లో ఏడోవిడతగా 57 లోక్‌సభ స్థానాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. ఇందులో కేవలం 25చోట్ల మాత్రమే భాజపా విజయం సాధించింది. మొత్తం ఏడు విడతల్లో భాజపా అతితక్కువ స్థానాలు సాధించింది ఈ దశలోనే. తాజాగా ఏడో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, చండీగఢ్‌లోని 29 స్థానాల్లో, పంజాబ్‌లో 13, బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో 15 చోట్ల జరగనుంది.

10శాతం నష్టాన్ని పూడ్చేనా..?

2014 సార్వత్రిక ఎన్నికల్లో 282 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించగా.. 2019లో వాటిలోని 26 స్థానాల్లో పరాజయం పాలైంది. అంటే గతంలో గెలిచిన దాదాపు 10శాతం స్థానాలను కోల్పోయింది. అయితే తూర్పు భారతంలో ఎక్కువ సీట్లు రావడంతో ఆ ఖాళీ భర్తీ అయింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ గతంలో సాధించిన 303 స్థానాల్లో 10శాతం మేర నష్టం ఉండొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నష్టాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌, దక్షిణభారతంలో భర్తీ చేయొచ్చని భాజపా ధీమాగా ఉంది.

ఏడో విడత ఇలా..

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరివిడతలో ఇండియా కూటమి నుంచి భాజపాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. పూర్వాంచల్‌ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడటం భాజపాకు ఇబ్బందిగా మారింది. ఈ ఎన్నికల్లో నాన్‌-యాదవ్‌ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఇండియా కూటమి ఎక్కువగా ఓబీసీ సామాజికవర్గానికి చెందిన వారికి సీట్లు కేటాయించింది. ఇది భాజపాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
  • గతంలో బిహార్‌లో ఏడోవిడతగా 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను ఎన్డీయే కూటమే కైవసం చేసుకుంది. అయితే, తాజాగా ఇండియా కూటమిలో సభ్యుడైన తేజస్వీయాదవ్‌ యువత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు భారీగా ఉద్యోగకల్పన చేశానంటూ.. సీఎం నీతీశ్‌కుమార్‌ను తక్కువ చేసి చూపించారు. ఇటీవల బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు కూడా ఎన్డీయే కూటమికి ప్రతిబంధకంగా మారే అవకాశముంది. భాజపా మాత్రం మోదీ చరిష్మాయే విజయం సాధించి పెడుతుందని బలంగా విశ్వసిస్తోంది.
  • బెంగాల్‌లో ఏడో దశలో పోలింగ్‌ జరిగిన 9 స్థానాల్లోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించి, భాజపాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఈసారి ఆయా నియోజకవర్గాల పరిధిలో మోదీ రోడ్‌షోలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈసారి బెంగాల్‌లో భాజపా ఎక్కువ సీట్లు సాధించాల్సిఉంది.
  • పంజాబ్‌లో భాజపాకు ఆదరణ అంతంతమాత్రమే. ఇక్కడి 13 స్థానాల్లో చివరిదశగా పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు బలంగా ప్రచారం నిర్వహించాయి. 2019లో గెలుపొందిన 2 స్థానాల్లోనైనా ఈసారి విజయం సాధించాలని భాజపా భావిస్తోంది. కానీ, ఇది అంత సులభం కాదు.
  • ఒడిశాలో ఏడోవిడత పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాల్లో భాజపా 2, బిజుద 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి అంతకు మించి సీట్లు సాధించాలని భాజపా భావిస్తోంది. ఇక్కడ మాత్రం భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. 

ఏదేమైనా.. భాజపా లక్ష్యం నెరవేరాలంటే.. చివరి దశ ఎన్నికల్లో గత ఫలితాల కంటే కచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించాలనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు