V.K. Pandian: ఈ ‘సూపర్’ పాండియన్.. రాజకీయాలను వీడతారా..?

ఒడిశాలో నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్న సమయంలో సూపర్ సీఎంగా చలామణీ అయిన వీకే పాండియన్ (V.K. Pandian).. చెప్పినట్టుగా రాజకీయాలను వీడనున్నారా..?

Published : 05 Jun 2024 18:14 IST

భువనేశ్వర్: ఈసారి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి కాకపోతే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వీకే పాండియన్‌ (V.K. Pandian) ఎన్నికల ప్రచారంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్‌ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు మాట్లాడుతూ..‘‘భాజపా వేవ్ ఉందని, ఒడిశాలో మార్పు ఉంటుందని మీరు చెప్తున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే, నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా’’ అని ప్రతిజ్ఞ చేశారు.

అయితే.. బీజేడీ అధికారంలోకి రాలేదు. భాజపానే ఆధిక్యత సాధించింది. 21 లోక్‌సభ స్థానాలకుగాను భాజపా 20 స్థానాలు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించింది. బిజూ జనతాదళ్‌(BJD) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల భాజపా విజయం సాధించింది. 51 చోట్ల బీజేడీ గెలిచింది. కాంగ్రెస్‌ 14 స్థానాలు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శాసనసభలో 74 స్థానాలు అవసరం కాగా, భాజపా ఆ సంఖ్యను దాటేసింది. ఆరోసారి ప్రమాణస్వీకారం చేసి.. సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోవాలన్న పట్నాయక్‌ కల ఈ ఫలితాలతో నెరవేరకుండా పోయింది. ఇక ఇప్పుడు భాజపా ముఖ్యమంత్రి ఎవరనేదీ ఖరారు కావాల్సి ఉంది. మాజీ కేంద్రమంత్రి జోయల్‌ ఓరం, భాజపా సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్‌, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, మరో నేత బైజయంత్‌ పండ సీఎం రేసులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. గత ఏడాది పాండియన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి.. బీజేడీలో చేరారు. 2019 ఎన్నికల ముందు నుంచి ఆయన నవీన్‌కు నమ్మకమైన అధికారిగా ఉన్నారు. తెర వెనక ఉంటూ పాలనలో, బీజేడీలో కీలకమయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం పార్టీ వ్యక్తిగా మారిపోయారు. నవీన్‌ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు ‘సూపర్ సీఎం’ అని పిలిచేవారు. బయటివ్యక్తి అంటూ ముద్ర పడిన పాండియన్.. చెప్పినట్టుగా ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తారా? లేదా? అనే ప్రశ్న వినిపిస్తోంది. లేకపోతే రాజకీయ స్టంట్‌గానే ఆ మాట అన్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని