Himachal Polls: కాంగ్రెస్‌ గెలిచినా.. ‘రాజసం’ చెదిరింది.. పరాజయం ‘పలకరించింది’

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకుటుంబీకుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. తాజా ఎన్నికల్లో రాజకుటుంబాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. ఒక వేళ ప్రతిభా సింగ్‌కు సీఎం పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి స్థానానికి కూడా రాజకుటుంబీకులు దూరమైనట్లవుతుంది.

Published : 10 Dec 2022 01:41 IST

శిమ్లా: ఒకప్పుడు హిమాచల్‌ రాజకీయాలను శాసించిన రాజ కుటుంబాలు ప్రజల ఆదరణ కోల్పోతున్నాయి. కాలంతోపాటు మారుతున్న రాజకీయ పరిణామాలు కావొచ్చు, పార్టీలో అంతర్గత విభేదాలు కావొచ్చు. కారణం ఏదైనా రాజకుటుంబీకుల్లో అప్పటి రాజసం లేదనే విషయం ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ రాజ కుటుంబాలకు చెందిన అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. వారు కూడా భారీ స్థాయిలో విజయాలు నమోదు చేశారా? అంటే అదీ లేదు. రామ్‌పూర్‌ బుష్‌హర్‌ రాజకుటుంబానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ తనయుడు విక్రమాదిత్య సింగ్‌ సిమ్లా రూరల్‌ నియోజకవర్గం నుంచి 13,860 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రవి మెహతాపై గెలుపొందారు. కాసుం పాటి స్థానం నుంచి కోటి రాజవంశానికి చెందిన అనిరుధ్ సింగ్‌, భాజపా అభ్యర్థి భరద్వాజ్‌పై కేవలం 8,865 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరిద్దరూ మినహా బరిలో నిలిచిన రాజకుటుంబీకులంతా పరాజయం పాలయ్యారు. కొందరికి పార్టీలు సీట్లు కేటాయించ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చంబా రాజవంశానికి చెందిన ఆశా కుమారి.. డల్హౌసీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు ఆమె అక్కడి నుంచే విజయం సాధించారు. కానీ, ఈసారి 9,918 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కుల్లు రాజవంశానికి చెందిన హితేశ్వర్‌సింగ్‌ బంజార్‌స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి సురేందర్‌  శౌరీ చేతిలో 19,963 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా ఆయన తండ్రి మహేశ్వర్ సింగ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. భాజపా అతడికి టికెట్‌ కేటాయించింది, కానీ, హితేశ్వర్‌ సింగ్‌ అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వీరితోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓటమి చవి చూశారు.

దాదాపు 4 దశాబ్దాలపాటు వీరభద్రసింగ్‌ హిమాచల్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన మరణం తర్వాత పార్టీ బాధ్యతలను ఆయన భార్య ప్రతిభా సింగ్‌ భుజానెత్తుకున్నారు. లోక్‌సభ సభ్యురాలుగానే ఉంటూ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో హిమాచల్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో సీఎం బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం కూడా ఇప్పటి వరకు ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు సీఎం అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌తోపాటు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధిపతి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, మాజీ విపక్షనేత ముఖేశ్‌ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కుల్‌దీప్‌ సింగ్ రాఠోడ్‌, ఠాకూర్‌ కౌల్‌సింగ్‌, ఆశాకుమారి, హర్షవర్ధన్‌ చౌహన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిభా సింగ్‌కే సీఎం పదవి ఇవ్వాలంటూ ఆమె మద్దతు దారులు ఆందోళనకు దిగుతున్నారు. ఒక వేళ ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సరేసరి.. లేదంటే ముఖ్యమంత్రి పీఠానికి కూడా రాజకుటుంబీకులు దూరమైనట్లవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని