Uddhav Thackeray: 20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి: ఎమ్మెల్యే రవి రాణా

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్డీఏతో చేరుతారని మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా వ్యాఖ్యానించారు.

Updated : 03 Jun 2024 16:54 IST

ముంబయి: భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత  శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) అందులో చేరే అవకాశం ఉందని మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణా(Ravi Rana)   అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి భాజపా అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం తరువాత 20 రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వంలో చేరుతారని రవి రాణా తెలిపారు. శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ చీలిపోతారని తాను ముందే ఊహించానని, ఇప్పుడు కూడా తాను చెప్పినట్లే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

“బాలాసాహెబ్ ఠాక్రే (Balasaheb Thackeray) కొడుకు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే కోసం కూటమిలోకి ఎల్లప్పుడూ ఒక కిటికీ తెరిచి ఉంటుందని ప్రధాని చెప్పారు. ఎన్డీఏలోకి తిరిగి రావడానికి ఉద్ధవ్ ఆ కిటికీని ఉపయోగించుకుంటారని నేను కచ్చితంగా చెప్పగలను” అని ఎమ్మెల్యే అన్నారు.

ఉద్ధవ్ ఎన్డీయేతో చేతులు కలుపుతారా?

ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్ష ఇండియా కూటమితో కలిసి పని చేస్తున్నప్పటికీ ఆయనకు ఎన్డీఏలోకి వెళ్లడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో ఓ ఇంటర్య్వూలో ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను బాలాసాహెబ్ ఠాక్రేకు సరైన వారసుడిగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ “బాలాసాహెబ్ ఠాక్రేకి నా పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఉద్ధవ్ కష్టాల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఉద్ధవ్ ఠాక్రే కోసం ఎల్లప్పుడూ ఒక కిటికీ తెరిచి ఉంటుంది” అని అన్నారు.

ప్రధాని మోదీ మాటలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, “తలుపులు తెరిచి ఉన్నప్పటికీ నేను మీ దగ్గరకు రాను. మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీ వద్దకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు