PM Modi: అధికార కాంక్షతోనే కాంగ్రెస్‌ దేశాన్ని ముక్కలు చేసింది: మోదీ

 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 23 May 2024 23:36 IST

పటియాలా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1971 సమయంలో తన చేతిలో అధికారం ఉంటే సిక్కుల ప్రవిత్ర స్థలం కర్తార్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారాను పాకిస్థాన్‌ నుంచి వెనక్కి తీసుకొచ్చి ఉండేవాడినని అన్నారు. పటియాలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. నవభారత నిర్మాణంలో పంజాబ్‌, సిక్కు సామాజిక వర్గానికి చెందినవారు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారని కితాబిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, డ్రగ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ కేవలం సంతకాలు పెట్టడానికే పరిమితవుతున్నారని, కేజ్రీవాల్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకే ఆయన సమయమంతా సరిపోతోందని ఎద్దేవా చేశారు.

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ తన చివరి సంవత్సరాలను కర్తార్‌పుర్‌ సాహిబ్‌లోనే గడిపారని, ఇది సిక్కుల పుణ్యక్షేత్రమని మోదీ గుర్తు చేశారు. కేవలం అధికార కాంక్షతోనే  దేశాన్ని కాంగ్రెస్‌ ముక్కలు చేసిందని ఆరోపించారు. కర్తార్‌పుర్‌ సాహిబ్‌లోని ఎడమభాగం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్నట్లు చెప్పిన ఆయన.. గత 70 ఏళ్లుగా దానిని కేవలం బైనాక్యులార్‌లోనే చూడగలుగుతున్నామని అన్నారు. ఈ పుణ్యస్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చే అవకాశం 1971లో వచ్చిందని చెప్పారు. 90 వేల మంది పాకిస్థాన్‌ సైనికులు భారత్‌ ఆర్మీ ఎదుట ఎదుట మోకరిల్లారని కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను తిరిగి తీసుకురాగలిగే ఆ అపూర్వ క్షణాలను అప్పటి ప్రభుత్వం వృథా చేసిందని మండిపడ్డారు. అప్పుడే మోదీ అధికారంలో ఉంటే కచ్చితంగా ఆ పుణ్యస్థలం భారత్‌లో భాగమై ఉండేదన్నారు. వాణిజ్య పరిశ్రమలు పంజాబ్‌ను వీడి వెళ్తున్నాయని, మాదకద్రవ్యాల విక్రయాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్రం రైతన్నల దీక్షలతో వెలవెలబోతోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని