Kangana: ‘ఇదేం మీ తాతల ఎస్టేట్‌ కాదు.. నన్ను భయపెట్టలేరు’: కంగన ఫైర్‌

సినీనటి కంగనా హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 12 Apr 2024 00:12 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి భాజపా (BJP) లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగిన సినీనటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల తలెత్తిన బీఫ్‌ వివాదం నేపథ్యంలో ‘కంగన కాంట్రవర్సీ క్వీన్‌’ అంటూ విమర్శించిన కాంగ్రెస్‌ నేత, హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు ఆమె దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌ ఆయన తాతల ఎస్టేట్‌ ఏమీ కాదని, తనను బెదిరించి వెనక్కి పంపించలేరన్నారు. గురువారం మండి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కంగన మాట్లాడుతూ.. ‘‘నన్ను బెదిరించి వెనక్కి పంపించడానికి హిమాచల్‌ ప్రదేశ్‌.. మీ తండ్రి, తాతల ఎస్టేట్‌ కాదు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నవ భారత్‌’’ అన్నారు.

బీఫ్‌ తిన్నట్లు ఆధారాలు చూపించండి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, విక్రమాదిత్య సింగ్‌లను కంగన ‘పప్పూ’గా పేర్కొన్నారు. దిల్లీలో బడా పప్పు ఒకరు ఉన్నారన్న ఆమె.. హిమాచల్‌లో ఛోటా పప్పు తాను బీఫ్‌ తింటానని చెబుతున్నారని మండిపడ్డారు. తాను బీఫ్‌ తిన్నట్లు ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. ఆయుర్వేదిక్‌, యోగా లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తున్నానన్నారు. అబద్ధాలు చెప్పడంలో విక్రమాదిత్య నంబర్‌ వన్‌ అని విమర్శించారు. తన తల్లిదండ్రుల సాయం లేకుండానే సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. ప్రజలకు సేవచేయాలన్న కోరికతో నే రాజకీయాల్లోకి వచ్చినట్టు  చెప్పారు. 

నటుల రాజకీయ రణస్థలం.. లోక్‌సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ

అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా!

ఉగాది నవరాత్రుల్లో యావత్‌ దేశం ఆడబిడ్డలను పూజిస్తోందని, అయినా కాంగ్రెస్ నేతల మహిళా వ్యతిరేక ఆలోచనల్లో మార్పు రావడంలేదన్నారు. తన సినిమాలోని ఒక్క సీన్ అయినా విజయవంతంగా చేయాలని విక్రమాదిత్య సింగ్‌కు సవాల్ విసిరారు. అలా చేయగలిగితే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాదు.. దేశం వదిలి వెళ్తానంటూ సవాల్‌ చేశారు. నటులు కళను ఎంచుకోరని.. కళే వారిని ఎంచుకుంటుందని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తనకు ఎదురైన బెదిరింపులు, అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు బెదిరింపు నోటీసులు పంపి కటకటాల్లోకి నెట్టినా ఏమీ చేయలేకపోయారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే.. కుమారులతో పోటీగా కూతుళ్లు అన్ని రంగాల్లో పోటీపడే సమాజానికి ఆదర్శంగా నిలుస్తానన్నారు. మనాలీయే తన నివాసమని.. అక్కడే ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

అసలు విక్రమాదిత్య ఏమన్నారు?

కంగన ‘‘వివాదాల రాణి’’ అని విక్రమాదిత్య సింగ్‌ అన్నారు. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్లపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతుంటాయని వ్యాఖ్యానించారు. బీఫ్‌ తిననంటూ ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. ‘‘ఆమెకు బుద్ధి ప్రసాదించాలని రాముడిని ప్రార్థిస్తున్నా. ఆమె దేవ్‌భూమి హిమాచల్‌ నుంచి బాలీవుడ్‌కు స్వచ్ఛంగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నా.. ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు. ఆమె ఎన్నికల్లో గెలవరు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని