YS Jagan: పరదాల పహిల్వాన్‌.. పెవిలియన్‌కు!

జగన్‌ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే.. హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి, అందరి మన్నన చూరగొనాల్సింది పోయి.

Updated : 05 Jun 2024 07:31 IST

విద్వేషం.. విధ్వంసంతో ఓటమికి బాటలు
అంతా నేనే.. అనే అహంకార ధోరణి 
ఎమ్మెల్యేలు, ఎంపీలనూ డమ్మీలుగా మార్చిన వైనం
జగన్‌ను చూసే జనం ఓటేస్తారంటూ గొప్పలు

ఈనాడు, అమరావతి: జగన్‌ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే.. హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి, అందరి మన్నన చూరగొనాల్సింది పోయి.. అధికారంతో విర్రవీగితే జనం ఎలా ఓటుతో బుద్ధి చెబుతారనేందుకు ఈ ఎన్నికల్లో జగన్‌ ఘోర పరాజయమే నిదర్శనం. జగన్‌ రివర్స్‌ పాలనతో విసిగిపోయిన జనం ఆయన అధికారాన్ని ఓటుతో రీకాల్‌ చేశారు.

ఎన్నికల ముందు ప్రజల్లో... ఎన్నికలయ్యాక ప్యాలెస్‌లో...

2019 ఎన్నికల ముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన జగన్‌...ఒక్క సారి అధికారంలోకొచ్చాక ఆ జనానికి దూరమయ్యారు. తాడేపల్లిలో ప్యాలెస్‌కు పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారు. రాజకీయ అవసరాలరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లలో కూడా పడకుండా తప్పించుకుని తిరిగొచ్చారు.  అయిదేళ్లూ జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశాన్నే కల్పించలేదు. ‘స్పందన’పేరుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానంటూ అధికారంలోకొచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, తర్వాత వదిలేయడం, ఇదీ జనం పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి. 

తాను భగవత్‌ స్వరూపుడా?

తానేదో భగవంతుడి స్వరూపుడినన్నట్లుగా...పథకాలను తానే సృష్టించి జనానికి ఉదారంగా ఇచ్చేస్తున్నా అన్నట్లుగా వాటన్నిటికీ తన పేరు పెట్టుకున్నారు. జనం సొమ్ముతో వ్యక్తిగత ప్రచారాన్ని చేసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లపైన కూడా ‘జగనన్న గోరుముద్ద’ అని రాయించారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు 2019లో అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్లకు పైగా ఖర్చు చేసి తన పార్టీ రంగులు వేయించారు. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని మార్చేందుకు మరో రూ.1000 కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. భూముల పట్టాదారు పాసుపుస్తకాలపైన, చివరికి సర్వే రాళ్లపైనా తన ఫొటోలు వేయించడం జగన్‌కే చెల్లింది. 

ఆంధ్రా ‘కిమ్‌’గా...

అధికారం చేపట్టిన వెంటనే కరకట్టపై ఉన్న ‘ప్రజావేదిక’ను కూల్చడంతో మొదలైన జగన్‌ ధ్వంస రచన అయిదేళ్లూ కొనసాగింది. తన దారికొస్తే సరేసరి..లేదంటే ఎవరి ఆస్తులనైనా కూల్చడమే పాలన అన్నట్లుగా ఆయన పనిచేశారు. దారికి రాని వారిపై కేసులూ మోపారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు చేయించి హింసించిన ఘనతా జగన్‌కే దక్కింది. అచ్చెన్నాయుడు, అయన్నపాత్రుడు లాంటి తెదేపాకు చెందిన సీనియర్‌ నేతలు, మాజీ మంత్రుల ఇళ్లపైకి పోలీసులను ఉసిగొల్పి బీతావహ వాతావరణాన్నీ సష్టించారు. ఆయనను రాష్ట్రంలోని ప్రతిపక్షాల నాయకులు ‘ఏపీ కిమ్‌’ అని పిలిచే పరిస్థితి కల్పించారు. 

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ లేరు..

‘అంతా నేనే.. నేను అనుకున్నట్లే చేస్తా.. నేను ఎవరిని నిలబెట్టినా జనం ఓట్లు వేస్తారంతే.. మా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కాదు జగన్‌ను చూసే జనం ఓట్లేస్తారు, నన్ను చూసి ఓట్లు వేయాలనే నేనూ చెబుతున్నా’ అని చెప్పడం ద్వారా తన ఫ్యూడల్‌ స్వభావాన్ని జగన్‌ చాటుకున్నారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను డమ్మీలుగా చూపించిన రాజకీయ నాయకుడూ ఆయనే. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను ఈ అయిదేళ్లూ పాలనలో ఎక్కడా భాగస్వాములను చేయని సీఎంగా మిగిలిపోయారు. 


వ్యూహాల పేరుతో కుతంత్రాలు

2019 ఎన్నికల ముందు కోడికత్తి దాడి పేరుతో డ్రామా ఆడారు. తర్వాత ఎన్నికల ముందు మాజీ మంత్రి తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యనూ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు విపరీత ప్రచారాన్ని చేసుకున్నారు. వాటితో అప్పుడు అనుకున్న ఫలితానే సాధించారు. అదే పంథాలో ఇప్పుడూ గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. 2019లో ఒకసారి నమ్మిన జనం..ఈసారి అస్సలు నమ్మలేదు. 


మీడియాకూ దూరంగానే...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అయిదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌ మాట్లాడారు. అది కూడా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ తాను చెప్పినట్లుగా వినలేదనే ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకే. మాటల్లో తడబాటు కారణంగానో, తన వ్యవహారాలపై మీడియా ప్రశ్నిస్తుందన్న ఆలోచనతోనో ఇన్నాళ్లూ మీడియాను తప్పించుకుని తిరిగారు. మంగళవారం ఘోరపరాజయం తర్వాత ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడి ఫలితాలపై తన స్పందనను ప్రకటించారు. 


ఓటమి ముంగిటా అదే ప్రగల్భాలు

మే 13న పోలింగ్‌తో తన పార్టీ పరిస్థితిపై స్పష్టత వచ్చినా..తనకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి..వారి బృందంతో మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. ఈ ఫలితాలతో దేశమంతా ఏపీ వైపు చూస్తుంది’అంటూ చెప్పడం ద్వారా ఒక రకంగా తన పార్టీ కార్యకర్తలనే మోసం చేశారు. జగన్‌ వ్యవహారశైలి కారణంగా వైకాపాకు ఎన్నికల్లో ఇబ్బందులు రాబోతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ముందు నుంచి అనధికారిక చర్చల్లో వాపోతూనే ఉన్నారు. ‘ఆయనా పోతున్నాడు, మమ్మల్ని ముంచుతున్నాడు’ అని వైకాపాలో బూతుల ప్రజాప్రతినిధిగా పేరుగాంచిన ఒక ఎమ్మెల్యే తన ఆంతరంగికుల వద్ద గత కొంతకాలం నుంచే చెబుతున్నారంటేనే జగన్‌ తీరును అర్థం చేసుకోవచ్చు.


నేను.. నా ఈగో..

నేను..నా ఈగో..అన్న తన సహజ ధోరణినే జగన్‌ ఈ అయిదేళ్లూ కొనసాగించారు. ఆయన నియంత్రతృత్వ పోకడలు నచ్చక, పార్టీలో తమకు జరుగుతున్న అవమానాలను తాళలేక ఇబ్బంది పడిన పలువురు సీనియర్‌ నేతలు వైకాపాను వీడారు. అలాంటి నేతలను పిలిచి మాట్లాడడం కానీ, వారికున్న ఇబ్బందిని పరిష్కరించే ప్రయత్నం కానీ జగన్‌ చేయలేదు. తన కుటుంబానికి ఆప్తుడైన మచిలీపట్నం ఎంపీ బాలశౌరితోపాటు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌ తదితర ముఖ్య నేతలు వైకాపాను వీడినా జగన్‌ పట్టించుకోలేదు. ఇప్పుడా నేతలు వారి పరిధిలో తీవ్ర ప్రభావాన్నే కనబరిచారు.


పవన్‌తో పోలికా..?

ప్రతిపక్ష నేతలను చులకన చేసి తాను మాట్లాడడమే కాకుండా.. తన పార్టీ నేతలతోనూ తిట్టించి ఆనందపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్‌ కల్యాణ్‌ అంటూ జనసేన అధ్యక్షుడిని దారుణంగా కించపరిచారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ పవన్‌ను తక్కువ చేసి మాట్లాడారు. 2019లో తనకు వచ్చిన అధికారాన్ని చూసుకుని విర్రవీగిన జగన్‌ మాటల తీరు ఇది. అదే పవన్‌కల్యాణ్‌ పార్టీ ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేసి సంపూర్ణ విజయాన్నందుకుంది. జగన్‌ 175 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 11 స్థానాలకే పరిమితమయ్యారు. 100 శాతం ఫలితాలు సాధించిన పవన్‌కు, కేవలం 6% సాధించిన జగన్‌కు పోలికెక్కడ మరి..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని