YS Jagan: పోలింగ్‌కు ముందు, తర్వాత సర్వేల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదు

‘పోలింగుకు ముందు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించాం. 17లక్షల శాంపిల్స్‌ తీసుకున్నాం. ఎక్కడా మనపై వ్యతిరేకత కనిపించలేదు.

Updated : 12 Jun 2024 07:54 IST

17లక్షల శాంపిల్స్‌ తీసుకున్నాం
వైకాపా నేతలతో జగన్‌

ఈనాడు, అమరావతి: ‘పోలింగుకు ముందు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించాం. 17లక్షల శాంపిల్స్‌ తీసుకున్నాం. ఎక్కడా మనపై వ్యతిరేకత కనిపించలేదు. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి’ అని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. వారితో జగన్‌ మాట్లాడుతూ.. ‘మనకు 40శాతం ఓటింగ్‌ ఉంది. మనం ప్రజల మధ్యనే ఉండాలి. మన కార్యకర్తలను తెదేపా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా పెడతారు. మనమంతా కలిసి ఎదుర్కోవాలి. జిల్లా స్థాయిలో మీరంతా జట్టుగా నిలవండి. కార్యకర్తలకు అండగా నిలబడి, వారిని ఆదుకోండి. నష్టపోయిన కార్యకర్తలను నేనూ పరామర్శిస్తా.. భరోసానిస్తా’ అని నాయకులకు చెప్పారు. ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు కొందరు వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ‘మన హయాంలో అమలుజేసిన పథకాలకు నిధులను ఈ బడ్జెట్‌తో ఇవ్వడానికి ఇబ్బందిపడ్డాం. అలాంటిది అంతకుమించిన పథకాలను చంద్రబాబు ఇస్తానన్నారు. ఆయన ఎలా చేయగలరు’ అని వ్యాఖ్యానించారు. వైకాపా అధినేతను కలిసిన వారిలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, ఇంతియాజ్, బిజేంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, రాపాక వరప్రసాద్, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని