YS Sharmila: నా ప్రచారంతో వైకాపాలో వణుకు: వైఎస్‌ షర్మిల

కడప వైకాపా (YSRCP) ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్‌రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు.

Updated : 13 Apr 2024 15:09 IST

ముద్దనూరు: కడప వైకాపా (YSRCP) ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్‌రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. ఆయన్ను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 

‘‘ఇది నా జన్మస్థలం. జమ్మలమడుగులోని క్యాంబెల్‌ ఆస్పత్రిలో పుట్టా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి మీ నాయకులు. మాతో ఎలా ఉన్నారో.. ఇక్కడి ప్రజల కోసం అలాగే ఉన్నారు. ఎప్పుడు పిలిచినా పలికేవారు. వివేకం సార్‌ అని పిలిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరికేది. ఈ జిల్లాకు స్టీల్‌ప్లాంట్‌ తీసుకురావాలని వైఎస్‌ఆర్‌ కలలు కన్నారు. దాంతో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని భావించారు. జగన్‌ రెండు సార్లు శంకుస్థాపన చేశారు.. కానీ పనులు జరగలేదు. వైఎస్‌ఆర్‌ కలల ప్రాజెక్టుకే దిక్కులేదు.    

ఈ జిల్లాలో నా ప్రచారంతో వైకాపాలో వణుకు పుడుతోంది. అవినాష్‌ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారు. ఆయనకు సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టింది. అయినా ఎలాంటి చర్యలు లేవు. అతడిని జగన్‌ కాపాడుతున్నారు. సొంత బాబాయ్‌ని చంపిన వాళ్లకి మళ్లీ సీట్‌ ఎందుకు ఇచ్చారు? ప్రజలు నిజాలు తెలుసుకున్నారని ఆయన్ను మార్చాలని చూస్తున్నారు. అవినాష్ ఓడిపోతారని తెలిసే మారుస్తున్నారా? హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసి ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలి. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా. వైఎస్‌ బిడ్డ కావాలో.. హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి’’ అని షర్మిల అన్నారు. 

న్యాయం వైపు నిలబడి షర్మిలను గెలిపించాలి: సునీత

వివేకా రాజకీయ అజాత శత్రువు అని ఆయన కుమార్తె సునీత అన్నారు. షర్మిలతో కలిసి ముద్దనూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘ సమస్య పరిష్కరించాలని ఎవరైనా వస్తే అధికారుల వద్దకు వెంట తీసుకెళ్లి దాన్ని పూర్తిచేయించేవారు. అలాంటి మనిషిని దారుణంగా నరికి చంపారు. మా కుటుంబసభ్యులే హతమార్చారని తెలిసి ఎంతో బాధపడ్డాం. వివేకా హత్య మా సొంత విషయం కాదు.. ఈ జిల్లా ప్రజలది. చంపిందెవరో అందరికీ తెలుసు. నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నాం. న్యాయం మావైపు.. అన్యాయం వారి వైపు ఉంది. ప్రజలు న్యాయం వైపు నిలబడి షర్మిలను గెలిపించాలి. ఆమె ఎంపీ అయితే దిల్లీ వరకు మన గొంతు వినిపిస్తుంది’’ అని సునీత అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని