Macherla: మాచర్లలో మహిళపై కత్తితో వైకాపా కార్యకర్త దాడి

పల్నాడు జిల్లాలో పోలీసు బందోబస్తు ఉన్నా.. 144 సెక్షన్‌ అమలులో ఉన్నా వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయి. మాచర్లలో మరో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమను ఎందుకు తిడుతున్నావు అని నిలదీసినందుకు కత్తితో ఓ మహిళపై విచక్షణారహితంగా నిందితుడు దాడులకు తెగబడ్డాడు.

Published : 27 May 2024 04:38 IST

పోలింగ్‌ రోజు ఘటనల్లో కేసులు ఉన్నా నిందితుడిని అరెస్టు చేయని పోలీసులు

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, కారంపూడి(మాచర్ల)-న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో పోలీసు బందోబస్తు ఉన్నా.. 144 సెక్షన్‌ అమలులో ఉన్నా వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయి. మాచర్లలో మరో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమను ఎందుకు తిడుతున్నావు అని నిలదీసినందుకు కత్తితో ఓ మహిళపై విచక్షణారహితంగా నిందితుడు దాడులకు తెగబడ్డాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాచర్ల 22వ వార్డులో ఉండే ఉప్పుతోళ్ల వెంకటేశ్‌ పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి రోజూ మద్యం తాగి వచ్చి వీధుల్లో వీరంగం చేస్తున్నాడు. తెదేపా సానుభూతిపరులను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చగొడుతున్నాడు. ‘రండిరా చూసుకుందాం.. మీ అంతుచూస్తా.. మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జోలికి వచ్చిన వాడి అంతుచూస్తా.. పొడుస్తా..’ అంటూ కత్తితో బహిరంగంగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. తెదేపా నాయకులు వార్డులో కనిపిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అనవసరంగా తమను ఎందుకు తిడుతున్నావని అదే వార్డులో ఉండే నీలావతి అనే మహిళ శనివారం రాత్రి వెంకటేశ్‌ను ప్రశ్నించారు. దీంతో వెంటనే చేతిలో ఉన్న కత్తితో మహిళ చేతులు, ముఖం, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాలతో రక్తమోడుతున్న ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మాచర్ల టౌన్‌ సీఐ బ్రహ్మయ్యను వివరణ అడగ్గా బంధువుల మధ్య గొడవలో దాడిచేశాడని, ఇందులో రాజకీయం లేదని చెప్పారు. నిందితుడిపై రౌడీషీట్‌ తెరిచామన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

ఉప్పుతోళ్ల వెంకటేశ్‌ను మట్టి అని పిలుస్తుంటారు. పోలీసులు వచ్చినప్పుడు మట్టి పూసుకుని తప్పించుకుంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలింగ్‌ రోజు ఘర్షణలతో పాటు మర్నాడు కారంపూడిలో విధ్వంసం వంటి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయలేదని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని