Janasena: మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు

మచిలీపట్నంలో వైకాపా మూకల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆయన కుమారుడు కృష్ణమూర్తి (కిట్టు)ల అనుచరులు పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నాయకులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

Published : 28 May 2024 05:07 IST

పేర్ని కిట్టు అనుచరుల పనేనని అనుమానం
గతంలోనూ బాధితుడి ఇంటిపై దాడి 

పూర్తిగా కాలిపోయిన కారు 

ఈనాడు, అమరావతి - మచిలీపట్నం, న్యూస్‌టుడే: మచిలీపట్నంలో వైకాపా మూకల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆయన కుమారుడు కృష్ణమూర్తి (కిట్టు)ల అనుచరులు పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నాయకులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన జనసేన నాయకుడు కర్రి మహేశ్‌కు చెందిన కారును ఆదివారం అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు తగలబెట్టడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే జనసేన నాయకుడి ఇంటిపై పేర్ని కిట్టు అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం అదే ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును తగలబెట్టారు. వాహనం మంటల్లో కాలిపోతుండడాన్ని అర్ధరాత్రి గుర్తించారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఎవరు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

బాధితుడు మహేశ్‌ నుంచి ఫిర్యాదు తీసుకుంటున్న పోలీసులు

కిట్టు, అనుచరులపై ఫిర్యాదు: కారు దహనం ఘటన పేర్ని కిట్టు, ఆయన అనుచరుల పనేనని బాధితుడు మహేశ్, జనసేన నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తన ఇంటిపై దాడికి పాల్పడినవారే తన కారును దహనం చేశారనే అనుమానం ఉందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు విశ్వబ్రాహ్మణ కాలనీలోకి ప్రచారం నిర్వహించేందుకు కిట్టు అనుచరులు వచ్చారు. వారు మహేశ్‌ ఇంటి వద్దకు వచ్చిన సమయంలో బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు దిగారు. అనంతరం ఇంటి లోపలికి వెళ్లి సామగ్రిని ధ్వంసం చేసి.. అడ్డొచ్చిన వారిని కొట్టారు. ఆ సమయంలో మహేశ్‌ భార్యపైనా దాడికి దిగారు. ఈ ఘటనను నిరసిస్తూ ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు పేర్ని కిట్టును ఏ-1గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.

మేం చనిపోయేవాళ్లం: తన కారుకు నిప్పు పెట్టి వైకాపా మూకలు రాక్షసానందం పొందుతున్నాయని మహేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కారు నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న తమ ఇంటి గోడ వైపు వ్యాపించాయని, ఆ పక్కనే వంట గది ఉందని.. అందులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఉంటే తాము చనిపోయేవాళ్లమన్నారు. ఇంతకుముందు వైకాపా వాళ్లు తన ఇంటిపై దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు పెట్టినా, ఒక్క రోజులోనే నిందితులు బయటకు వచ్చేశారని వాపోయారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే.. మళ్లీ ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ.. కారును తగలబెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని