Jakkampudi Raja: ‘నమ్మిన కోటరీ, అధికారులే వ్యవస్థలను భ్రష్టు పట్టించారు’

‘ప్రభుత్వంలో ఉన్న ధనుంజయరెడ్డి లాంటి కొందరు పనికిమాలిన అధికారులు, నమ్మిన కోటరీ.. వ్యవస్థలను భ్రష్టు పట్టించాయి. అటువంటి అధికారుల మాయలో ముఖ్యమంత్రి జగన్‌ ఇరుక్కున్నారు.

Updated : 06 Jun 2024 07:51 IST

ధనుంజయరెడ్డి లాంటి అధికారుల  మాయలో జగన్‌ ఇరుక్కున్నారు

విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా  వైకాపా అధ్యక్షుడు జక్కంపూడి రాజా 

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, వీఎల్‌పురం: ‘ప్రభుత్వంలో ఉన్న ధనుంజయరెడ్డి లాంటి కొందరు పనికిమాలిన అధికారులు, నమ్మిన కోటరీ.. వ్యవస్థలను భ్రష్టు పట్టించాయి. అటువంటి అధికారుల మాయలో ముఖ్యమంత్రి జగన్‌ ఇరుక్కున్నారు. సమస్యలు పరిష్కరించాలని సీఎంఓ వద్దకు వెళ్తే కొందరు అధికారుల నుంచి స్పందన లభించే పరిస్థితి లేకుండా పోయింది’ అని తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు, రాజానగరం తాజా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఏ ఎమ్మెల్యే అయినా ధనుంజయరెడ్డి దగ్గరకు వెళ్తే ఆయనే ఓ సీఎంలా భావిస్తూ గంటలకొద్దీ నిలబెట్టించి, లోపలికి వెళ్లిన తరవాత తీరికలేదన్నట్ల్లుగా.. కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా.. చెప్పిన సమస్యను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఇటువంటి అధికారులంతా జగన్‌ చుట్టూ ఉండి పార్టీని నిర్వీర్యం చేశారన్నారు. సమస్యను సీఎంకు వివరిస్తే.. ధనుంజయరెడ్డిపై ఉన్న గుడ్డి విశ్వాసంతో ఆయనను పిలిచి చెప్పడం తప్ప పని జరిగేది కాదన్నారు.. అలా ఏ దస్త్రం ఆయన దగ్గరకు వెళ్లినా ఇలానే ఉండేదని.. ఇలా వందలకొద్దీ సమస్యలున్నాయని మండిపడ్డారు. కోరుకొండ భూముల సమస్య పరిష్కారానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశామన్నారు. దానిని పరిష్కరించాలని సీఎంఓ, ధనుంజయరెడ్డి దగ్గరకు పది దఫాలు తిరిగానని.. పురుషోత్తపట్నం భూముల రైతులకు పరిహారం ఇవ్వాలని కోరినా, విదేశీ విద్యాదీవెన బకాయిలు చెల్లించాలని కోరినా.. రేపు, ఎల్లుండి అంటూ అయిదేళ్లు గడిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కొందరు అధికారులు, కోటరీ జగన్‌ను ఓ మాయలో ఉంచి వ్యవస్థలను భ్రష్టు పట్టించాయన్నారు. ఉపాధిహామీ బిల్లులు చెల్లించకుండా పార్టీని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేశారని వాపోయారు. 

గొప్పగా పాలించామనే భ్రమలో బతికేశాం.. 

‘ఇన్నాళ్లూ మా అంత గొప్పగా ఎవరూ పాలన చేయలేదనే భ్రమలో బతికేశాం. రాజకీయాల్లో ప్రజలు మారాలో.. మేము మారాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చాలంటే మా కుటుంబం ఆస్తులన్నీ అమ్మినా తీరవు. 2019 ఎన్నికలకు ముందు లిక్కర్‌ సీసా పట్టుకుంటే షాక్‌కొట్టే విధంగా ధరలు పెంచుతామని జగన్‌ చెప్పారు. అదిచూసే  151 స్థానాలు ప్రజలు ఇచ్చారని అనుకుని ఎడాపెడా ధరలు పెంచాం. అది తప్పా, ఒప్పా అనే అంశంపై ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలకు మంచి చేసిన వైకాపాను 11 స్థానాలకు పరిమితం చేశారు. మా బుర్రలు మార్చుకోవాల్సి వస్తోంది. ప్రజాతీర్పును గౌరవిస్తాం. నిత్యం ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నించిన నన్ను 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు’ అని రాజా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు