YSRCP: ఆటవిక పాలనలో అరాచకాలెన్నో!

పల్నాడు జిల్లాలో ఐదేళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజూ కొనసాగాయి. పల్నాడు జిల్లాలోని మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలూ అధికార పార్టీవారే కావడంతో ఐదేళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది.

Updated : 05 Jun 2024 12:42 IST

పోలింగ్‌ రోజు అకృత్యాలపై వీడియోలు వెలుగులోకి 
పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం
ఈనాడు - అమరావతి

పల్నాడు జిల్లాలో ఐదేళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజూ కొనసాగాయి. పల్నాడు జిల్లాలోని మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలూ అధికార పార్టీవారే కావడంతో ఐదేళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటికి రావడం, పిన్నెల్లి సోదరులు పరారు కావడంతో పోలింగ్‌ నాటి అరాచకాల వీడియోలను కొందరు ధైర్యంగా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.దీంతో పల్నాడులో వైకాపా నేతల దౌర్జన్యాలు ఈ స్థాయిలో జరిగాయా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మాచర్ల మండలం రాయవరం పోలింగ్‌బూత్‌లో ఏఎస్సైని బెదిరిస్తున్న వైకాపా నేత జగదీష్‌కుమార్‌

మాచర్ల మండలం రాయవరం పోలింగ్‌ బూత్‌ 51లో తెదేపాకు ఓట్లు పడుతున్నాయని దబాయిస్తూ ఇద్దరు వైకాపా వారు పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లి కూర్చున్నారు. తెదేపావారు అభ్యంతరం చెప్పడంతో విధుల్లో ఉన్న ఏఎస్సై వైకాపా వారిని బయటికి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో వైకాపా నేత జగదీష్‌కుమార్‌ బయటికి వస్తూ ఏఎస్సైకి వేలు చూపిస్తూ నీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించారు. పోలీసులు ఏజెంట్లు మినహా మిగిలినవారిని బయటికి పంపేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్సై వైకాపా వారు గుంపులుగా ఉన్నా అడ్డుకోకుండా తెదేపా కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తెదేపా ఏజెంట్లు గాలి చంద్రశేఖర్, గాజుల కొండలరావు, గాజుల నాగేశ్వరరావులను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటికి పంపించి వైకాపా వారు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. తెదేపా నాయకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైను అక్కడి నుంచి పంపించి తెదేపా ఏజెంట్లను లోపల కూర్చోబెట్టడంతో పోలింగ్‌ మళ్లీ ప్రశాంతంగా కొనసాగింది. పోలీసులను వైకాపా నేతలు పోలింగ్‌ బూత్‌ వద్ద బెదిరిస్తున్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

నరసరావుపేటలోనూ అధికార పార్టీ దౌర్జన్యం

నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్‌ వద్ద తెదేపా కార్యకర్తలపై దాడి చేస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్‌ రోజు అనుచరులతో పదుల సంఖ్యలో వాహనాలతో పోలింగ్‌ కేంద్రాల్లో తిరుగుతూ హడావుడి చేయడంతో ఎన్నికల సంఘం ఆయన్ను గృహనిర్బంధం చేయాలని ఆదేశించింది. గృహనిర్బంధం చేసిన నిమిషాల వ్యవధిలోనే తాను ఓటు వేయాలంటూ బయటికి వచ్చిన ఎమ్మెల్యే.. ఓటేసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలోకి వెళ్లి అనుచరులను రెచ్చగొట్టి, బయట ఉన్న తెదేపా అభ్యర్థి అరవిందబాబు వాహనాలపై దాడి చేయించారు. అరవిందబాబు వాహనం ఎక్కగానే ఆయనతోపాటు ఉన్న వాహనాలు వెళుతున్న సమయంలో వైకాపా మూకలు దాడి చేస్తూ తెదేపా వారిని వెంటపడి కొట్టాయి. ఇదే పోలింగ్‌ కేంద్రంలోకి నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్న కట్టా నారపరెడ్డి తరచూ  వెళ్లి వస్తుండటంతో ఓటర్లను ప్రభావితం చేయడానికే ఆయన వస్తున్నారని తెదేపా నాయకులు అభ్యంతరం చెప్పారు. వైకాపా మూకలు తెదేపా వారిపై దాడిచేస్తుండగా నారపరెడ్డి కూడా గట్టిగా అరుస్తూ దుర్భాషలాడటం గమనార్హం. ఎమ్మెల్యే అనుచరులు తెదేపా శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా గురువారం వెలుగులోకి వచ్చింది.

నరసరావుపేటలోని మున్సిపల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఏజీపీ కట్టా నారపరెడ్డి


కనిపించిన వారినల్లా కొట్టారు

వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో హల్‌చల్‌ చేస్తున్న వైకాపా మూకలు

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో ఒకే పోలింగ్‌ కేంద్రంలో మూడు పోలింగ్‌బూత్‌లు ఉన్నాయి. ఇక్కడ తెదేపా, స్వతంత్ర అభ్యర్థి తరఫున కలిపి 9 మంది ఏజెంట్లు కూర్చున్నారు. మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వచ్చారు. తన బంధువైన సుబ్బారెడ్డిని పోలింగ్‌ కేంద్రంలోకి పంపారు. సుబ్బారెడ్డి కేంద్రం లోపలికి వెళుతూ అక్కడ ఉన్న వైకాపా నాయకులను ఉద్దేశించి మీకు సిగ్గు లేదారా? తెదేపా ఏజెంట్లను బయటికి పంపండి అని కసిరారు. మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుందని తెదేపా ఏజెంట్లను హెచ్చరించారు. తెదేపా ఏజెంట్లు కదలకపోవడంతో వైకాపా వారంతా కర్రలు, కత్తులు, రాడ్లతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి వారిని బయటికి లాగేశారు. గ్రామంలో తరుముతూ వారి ఇళ్లపైకి వెళ్లి కనపడ్డవారినల్లా కొట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు. రేఖ్యానాయక్‌ అనే ఏజెంటును బరిసెతో పొడిచారు. మధ్యాహ్నం నుంచి ఏకపక్షంగా వైకాపా వాళ్లు ఓట్లేసుకున్నారు. ఎట్టకేలకు ఈ నెల 16న తెదేపా ఏజెంటు హనుమంతునాయక్‌ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని