YSRCP: ఈ ఓటమి ఆనాడే తెలిసింది !

జగన్‌ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దాదాపు పద్నాలుగు నెలల క్రితమే తెలిసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాను మట్టి కరిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఏడాది క్రితమే అర్థమైంది.

Updated : 05 Jun 2024 07:40 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తేలిగ్గా తీసుకున్న వైకాపా
ఘోర వైఫల్యానికి అప్పుడే నాంది

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దాదాపు పద్నాలుగు నెలల క్రితమే తెలిసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాను మట్టి కరిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఏడాది క్రితమే అర్థమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలనూ తెదేపా గెలుచుకుంది. మితిమీరిన అహంకారంతో ఉన్న వైకాపా నాయకులు మాత్రం ఆ ఓటమిని తేలిగ్గా తీసుకున్నారు. వాళ్లు మా ఓటర్లు కాదులే... మా ఓటర్లు వేరే ఉన్నారని బీరాలు పలికారు. అప్పుడు తెదేపా విజయాన్ని కొట్టి పారేసినందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. 2023 మార్చిలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 108 శాసనసభ స్థానాల పరిధిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. వైకాపా కంచుకోటల్ని అవలీలగా బద్దలుకొట్టింది. ఉత్తరాంధ్ర, తూర్పు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో ఘన విజయం సాధించింది.

పశ్చిమ రాయలసీమ ప్రాంత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి... జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందినవారే కావడం మరో విశేషం. సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఆ ఎన్నికలు నిదర్శనమని వైకాపా గ్రహించలేకపోయింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ఊరించినా ఆ పప్పులేమీ ఉడకవంటూ అక్కడి ప్రజలు తమను కోలుకోలేని దెబ్బ కొట్టారని, వైకాపా తనకు తిరుగే లేదని భావించే రాయలసీమ జిల్లాల్లోనూ ప్రజలు కీలెరిగి వాత పెట్టారని గుర్తించలేకపోయింది. అప్పుడే అహంకారాన్ని విడిచిపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉంటే వైకాపాకు మరీ ఇంత ఘోర పరాభవం ఎదురయ్యేది కాదేమో..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని