YSRCP: పిన్నెల్లి వ్యవహారంతో ఇరుకునపడ్డ వైకాపా

స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు ముందుండి మార్గదర్శకంగా నిలవాల్సిన ఎమ్మెల్యేనే పోలింగ్‌ బూత్‌లో చొరబడి ఈవీఎంను పగలగొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం అధికార పక్షమైన వైకాపాకు తలనొప్పిగా తయారైంది.

Updated : 24 May 2024 07:24 IST

సమర్థించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేతలు

ఈనాడు, అమరావతి: స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు ముందుండి మార్గదర్శకంగా నిలవాల్సిన ఎమ్మెల్యేనే పోలింగ్‌ బూత్‌లో చొరబడి ఈవీఎంను పగలగొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం అధికార పక్షమైన వైకాపాకు తలనొప్పిగా తయారైంది. ఈ వ్యవహారాన్ని సమర్థించుకోలేక నానా అవస్థలూ పడుతోంది. పోలింగ్‌ జరిగిన రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టడమే కాకుండా బయటకు వచ్చి సాగించిన హింసాకాండకు సంబంధించిన వీడియో ఫుటేజీ జనబాహుళ్యంలోకి రావడం.. ఆ తరవాత ఈసీ ఆదేశాలతో ఆయనను పోలీసులు అరెస్టు చేయబోతే.. కనిపించకుండా పోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ ఇరకాటంలో పడిపోయింది. తమ ఎమ్మెల్యే వ్యవహారాన్ని సమర్థించుకునే ప్రయత్నాల్లో ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే..దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల వాదనలను తెరపైకి తెస్తోంది. వీడియోలో ఉన్న విషయాన్ని చర్చ నుంచి పక్కకు నెట్టేందుకు అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటూ ఆ పార్టీ నాయకులు కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం సరైందా కాదా అనే విషయంలోకి వెళ్లకుండా.. సంబంధం లేని వాదనలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. పిన్నెల్లి వెళ్లిన బూత్‌లోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, వాటికి సంబంధించిన వీడియోలు బయటకు ఎందుకు రావడం లేదంటూ వైకాపా నాయకులు అడ్డంగా వాదిస్తున్నారు. మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట, పొన్నూరు, చంద్రగరి, బాపట్ల, మార్కాపురం, కుప్పం, గంగాధర నెల్లూరు, టెక్కలి, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, రాయచోటి, జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వైకాపా నేతలు గురువారం ఫిర్యాదు చేశారు.

ఈ నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలు రిగ్గింగు, బూత్‌ క్యాప్చరింగులకు పాల్పడ్డారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఆరోపిస్తున్న బూత్‌లకు సంబంధించిన వీడియోలనూ బయట పెట్టాలంటూ పిన్నెల్లి వ్యవహారాన్ని పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రగిరిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడతో ఆ నియోజకవర్గంలో కొన్ని బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని వైకాపా నేతలు కోరడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా పిన్నెల్లి వ్యవహారంతో వైకాపా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు