YSRCP: అరాచక రాజ్యాలు.. ఆ నియోజకవర్గాలు

ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్‌ ప్రభుత్వం సామంత రాజులను తయారుచేసింది. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల్లో అత్యధికులు అరాచకాలకు, అకృత్యాలకు అతీతులు కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ ఐదేళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో దారుణాలు చేశారు.

Updated : 26 May 2024 08:53 IST

అక్కడ వైకాపా నేతలు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం
ప్రశ్నించిన వారిపై దాడులు.. ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు
అధికారం అండతో గూండాగిరీ
ఐదేళ్లలో చేసిన దారుణాలెన్నో..
ఎన్నికల సమయంలోనూ దమనకాండ
ఈనాడు - అమరావతి

ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్‌ ప్రభుత్వం సామంత రాజులను తయారుచేసింది. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల్లో అత్యధికులు అరాచకాలకు, అకృత్యాలకు అతీతులు కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ ఐదేళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో దారుణాలు చేశారు. విపక్ష నేతలు, సామాన్యుల నోళ్లు నొక్కేశారు. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని నేర సామ్రాజ్యాలుగా మార్చుకున్నారు. అధికారం అండతో ఐదేళ్లూ పేట్రేగారు. పోలీసులు, ఇతర వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను, బలహీనులను అణచివేశారు. పాశవికంగా హత్యలు, దాడులు చేయించారు. తమ అక్రమాలకు ఎదురునిల్చిన, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు, ఇతరులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. వారి ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ఆస్తులు దోచుకున్నారు. ప్రకృతి వనరులను చెరబట్టి రూ.వందల కోట్లకు పడగలెత్తారు. దోచుకున్న సొమ్మును వెదజల్లుతూ ఎన్నికల్లోనూ పేట్రేగిపోయారు. ప్రతిపక్షాల్ని భయపెట్టారు. బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి, గూండాగిరీకి పాల్పడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఈవీఎంను నేలకేసి కొట్టడం, పోలింగ్‌ మర్నాడు నియోజకవర్గంలో వీరంగం చేయడం దేశమంతా చూసింది. వైకాపా నాయకుల విషపుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న నియోజకవర్గాల్లో మాచర్లతోపాటు తాడిపత్రి, పులివెందుల, పుంగనూరు, చంద్రగిరి, నరసరావుపేట, విశాఖ ఉత్తరం వంటివి ఉన్నాయి. 

ప్రజాప్రతినిధి వీరంగం

అనంతపురం జిల్లాలో కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన అరాచకాలతో ప్రజలు ఐదేళ్లుగా నరకం చవిచూశారు. ఏరోజూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని ఆ ప్రజాప్రతినిధి నిత్యం పగలు, ప్రతీకారాలతో రగిలిపోయారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించి చిత్రహింసలు పెట్టారు. ప్రజాప్రతినిధినని మరిచిపోయి వీధిరౌడీలా ప్రవర్తించారు. తన రాజకీయ ప్రత్యర్థి, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఇంటికి మారణాయుధాలతో వెళ్లి వీరంగం సృష్టించారు. తెదేపా సానుభూతిపరుల చీనీ తోటలను నరికేయించారు. మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలెడతానంటూ బహిరంగంగానే ప్రకటించిన ఆయన.. ఈ ఐదేళ్లూ అలాగే అరాచకాలతో చెలరేగారు. ఆయన కుమారుడు కూడా ప్రజాప్రతినిధికేమీ తీసిపోరు. తండ్రీకొడుకులు కలిసే హింసాకాండ కొనసాగించారు. గతంలో అక్కడ పనిచేసిన ఒక డీఎస్పీని అడ్డుపెట్టుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలపై అణచివేతకు పాల్పడ్డారు. నియోజకవర్గ కేంద్రమైన మున్సిపాలిటీకి ఛైర్మన్‌గా తెదేపా నేత ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రజాప్రతినిధి.. ఛైర్మన్‌కు సహకరించవద్దని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తెదేపా నేత సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి అవినీతిని ప్రశ్నించినందుకు తెదేపా దళిత కౌన్సిలర్‌ ఇంటిపై దాడి చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా ఆ ప్రజాప్రతినిధి మరోసారి వీరంగం సృష్టించారు. తెదేపా ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. తెదేపా బీసీ నేత ఇంటికి వెళ్లి దాడి చేశారు. అనంతరం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

తిరుపతి జిల్లాలో అరాచకశక్తి ఆ ప్రజాప్రతినిధి

తిరుపతిలో స్ట్రాంగ్‌రూంలు పరిశీలించేందుకు ఈ నెల 14న వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి తదితరులు రాళ్లు, సమ్మెట, బీరుబాటిళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వారంతా తిరుపతి జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులు. సీఎం జగన్‌ అండ చూసుకుని ఈ ఐదేళ్లలో ఆ ప్రజాప్రతినిధి ఎంతగా చెలరేగిపోయారో, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. పోలీసుల్ని ప్రయోగించి ఈ ఐదేళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందినవారిని నోరెత్తకుండా చేశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేస్తుండగా, ఆయన మరో జిల్లాలో లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగే ఉత్సవాలకు దేవుళ్లనే అక్కడికి దిగి వచ్చేలా చేయడంలో ఆ ప్రజాప్రతినిధి దిట్ట. ఉగాది వేడుకల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం దంపతుల కోసం భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక గుడి కట్టడం వెనక ఆ ప్రజాప్రతినిధి కృషి ఉంది. అలా వీరవిధేయత కనబరుస్తూ సీఎంకు దగ్గరై ఆయన అండతో తన నియోజకవర్గాన్ని నేరసామ్రాజ్యంగా మార్చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఈసారి కుమారుణ్ని గెలిపించేందుకు అన్ని అడ్డదారులూ తొక్కారు. రౌడీ గ్యాంగ్‌లను పెంచి పోషించి వారితో తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు వేసినప్పటినుంచే నియోజకవర్గంలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుటే వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి చేశాయి. పోలింగ్‌ రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాల్వలో వైకాపా అభ్యర్థి తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చి తెదేపా నేతలను భయభ్రాంతులను చేశారు. 

ప్రభుత్వ పెద్ద కుటుంబం అక్రమాలకు అది అడ్డా..!

ప్రభుత్వ పెద్ద ప్రాతినిధ్యం వహించే వైఎస్సార్‌ జిల్లాలోని ఆ నియోజకవర్గం ప్రత్యేక సామ్రాజ్యం. అక్కడ రాజ్యాంగం, నియమాలు, నిబంధనలు పనిచేయవు. ఏ ఎన్నికలూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగవు. నియంత పాలన కొనసాగుతోంది. వైకాపా తప్ప ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చోనివ్వరు. ఐదేళ్లలో అన్ని ఎన్నికలూ దౌర్జన్యంగా, ఏకపక్షంగా చేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలు వైకాపా నేతల గుప్పిట్లోనే ఉంటాయి. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తెదేపా ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. 2019 ఎన్నికల్లో తెదేపా ఏజెంటుగా ఉండేందుకు వచ్చిన వ్యక్తిని.. వ్యవసాయ మోటారు పైప్‌లు కత్తిరించి బావిలో పడేస్తామని, చీనీ తోట ఎండిపోతుందని బెదిరించారు. అక్కడ వైకాపా అణచివేతలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం.  ఒక కీలక నేత హత్యకేసులో ప్రధాన నిందితుడైనా, ప్రభుత్వ పెద్ద అండతో అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఒక ప్రజాప్రతినిధి చెప్పిందే శాసనం. ఆ ప్రజాప్రతినిధి అనుచరుల గుప్పిట్లో చిక్కుకుని నియోజకవర్గ ప్రజలు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. నియోజకవర్గంలోని వైకాపా చోటామోటా నేతలందరికీ ఆ ప్రజాప్రతినిధి సిఫారసుపై అప్పటి ఎస్పీ అన్బురాజన్‌ నిబంధనలకు విరుద్ధంగా గన్‌ లైసెన్సులు మంజూరు చేశారు. కొందరికి గన్‌మెన్‌లను ఇచ్చారు. టిఫిన్‌ సెంటర్‌ నడిపే ఒక వ్యక్తికి అలాగే లైసెన్సు ఇస్తే నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున కాల్పులకు తెగబడి ఒకరిని చంపేశాడు. ఆ నియోజకవర్గంలో పోలీసులు ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లకే ప్రాధాన్యమిస్తారు. ప్రతి మండలానికి పార్టీ తరఫున ఒకరు ఇన్‌ఛార్జిగా ఉంటారు. పోలీసులు వారి కనుసన్నల్లో పనిచేయాల్సిందే. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో అనేక హత్యలు, అణచివేతలు జరిగినా ఎవరూ నోరెత్తరు. 2022 సెప్టెంబరు 19న పరమేశ్వర్‌రెడ్డి అనే తెదేపా నేతను వైకాపా వర్గీయులు హతమార్చారు. కృష్ణయ్య అనే దళితుడిని వైకాపా నేతలు గ్రామం నుంచి బహిష్కరిస్తే పోలీసు రక్షణతో తిరిగి వచ్చారని కక్షగట్టి నెల గడవకముందే కిరాతకంగా హతమార్చారు.

విశాఖలో ఆ రౌడీనే రాజు

ప్రశాంతతకు మారు పేరైన విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నాయకుడు.. ప్రభుత్వ పెద్దల అండతో నియోజకవర్గాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రౌడీయిజం, స్థిరాస్తి దందాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, అణచివేతల్లో ఆ నాయకుడి ప్రతిభను గుర్తించి ఈ ఎన్నికల్లోనూ పార్టీ ఆయనకే టికెట్‌ ఇచ్చింది. ఆయన నామినేషన్‌ వేసిన రోజు రౌడీగ్యాంగ్‌లను, అరాచక శక్తుల్ని వెంటేసుకుని హల్‌చల్‌ చేశారు. రిటర్నింగ్‌ అధికారి గదిలోకి పదుల సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని వెళ్లారు. పోలీసులు ఎంత చెప్పినా లెక్కచేయలేదు.  నామినేషన్‌ పత్రాల సమర్పణ సమయంలో వంద మీటర్ల వెలుపలే అంతా ఉండిపోవాలి. ఇక్కడ మాత్రం భారీ ఊరేగింపు, చప్పుళ్లతో కార్యాలయం సమీపం వరకు చేరుకున్నారు.

ఆటవిక రాజ్యం ఆ నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో నిత్యం రావణకాష్ఠంలా రగిలే ఆ నియోజకవర్గంలో వైకాపా ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడి అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. 20 ఏళ్లుగా అక్కడి ప్రజల్ని పీడిస్తున్న ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంలా, ఆటవిక రాజ్యంలా మార్చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు, హత్యాకాండకు తెగబడ్డారు. ఆ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో వైకాపా మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు తెదేపా మద్దతుదారుల్ని గ్రామాలనుంచి తరిమికొట్టాయి. తెదేపాకు పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీవారిని గ్రామ బహిష్కరణ చేశారు. వైకాపా మూకలు పట్టపగలే హత్యలకు తెగబడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలను బెదిరించి మాచర్ల మున్సిపాలిటీతోపాటు, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో స్థానిక పదవులన్నీ వైకాపా అభ్యర్థులకే ఏకగ్రీవం చేసుకున్నాయి. అక్కడ అన్ని పదవులు, కాంట్రాక్టులు ఆ ప్రజాప్రతినిధికి, ఆయన సోదరుడికి, వాళ్ల మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలూ వాళ్లే చేయాలి. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని వారు పీల్చిపిప్పి చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా ఆ ప్రజాప్రతినిధి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారంటే ఎంత కండకావరమో అర్థమవుతోంది. పోలింగ్‌ సందర్భంగా హింసాకాండకు పాల్పడి సీఐని కూడా కొట్టినందుకు ఆ ప్రజాప్రతినిధిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైనా పోలీసులు ఇప్పటికీ ఆయన్ను పట్టుకోకుండా డ్రామాలు పండిస్తున్నారంటే పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో సాయపడుతుందో అర్థమవుతోంది.


పేరుకు డాక్టర్‌... పక్కా రౌడీలా చేష్టలు

పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గం మాచర్లకేమీ తీసిపోదు. దానికి పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి వృత్తిరీత్యా వైద్యుడు. ఉన్నత విద్యావంతుడినని మర్చిపోయి ఈ ఎన్నికల్లో ఆయన వీధి రౌడీలా ప్రవర్తించారు. పోలింగ్‌ రోజున అనుచరులను రెచ్చగొట్టి బీభత్సం సృష్టించారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పారు. పట్టణంలోని మున్సిపల్‌ హైస్కూలు బూత్‌ వద్ద ఆ ప్రజాప్రతినిధి తన కారులో పది మందికిపైగా అనుచరులను వెంటేసుకుని కర్రలతో వీరంగం చేస్తూ అందరినీ భయభ్రాంతులను చేశారు. సాయంత్రం 200 మందికిపైగా కార్యకర్తలకు కర్రలు సరఫరా చేశారు. గుంటూరు రోడ్డులోని తన ఆసుపత్రి వద్ద ఆయన కారుపై నిలబడి ఉండగా, అనుచరులు కర్రలను పైకి చూపిస్తూ రౌడీయిజం ప్రదర్శించారు. ఆ ప్రజాప్రతినిధి మీసం మెలేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ ఐదేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేశారు. రౌడీ మూకలు, అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు.


‘పెద్దాయన’ నేరసామ్రాజ్యం ఆ నియోజకవర్గం

వైకాపా ప్రభుత్వంలో నంబరు 2గా చెలామణి అవుతున్న, ‘పెద్దాయన’గా అందరూ పిలుచుకునే ఆ ప్రజాప్రతినిధి చిత్తూరు జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకే వైకాపా కార్యకర్తలను, పోలీసులను ఉసిగొల్పి నియోజకవర్గంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండేందుకు వెళుతున్న 14 మంది తెదేపా కార్యకర్తల్ని ఆయన అనుచరులు మధ్యలోనే అపహరించారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వారిని విడిచిపెట్టారు. ఆ పెద్దాయన ఎంత అరాచకశక్తో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. అన్ని వ్యవస్థల్నీ కనుసైగలతో శాసించే ఆయన పేరు చెబితే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు సైతం వణికిపోతారు. ఆ పెద్దాయనకు పోలీసులే సైన్యం. వారే దాడులు చేయించి బాధితులపైనే కేసులు పెట్టిస్తారు. కొన్ని నెలల క్రితం సైకిల్‌ యాత్ర చేస్తూ కుప్పం వెళుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెదేపా కార్యకర్తల దుస్తులు విప్పించిన అమానవీయ సంఘటన జరిగింది ఆయన సామ్రాజ్యంలోనే! స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకుని బీభత్సం సృష్టించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లు తిరస్కరింపజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో మూడు పంచాయతీలు తప్ప అన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు. పెద్దాయన అనుచరుల ఇసుక దోపిడీపై గళమెత్తిన తెదేపా కార్యకర్త శివకుమార్‌పై 2022 జులైలో వైకాపా నాయకులు దాడి చేసి చేతులు విరగ్గొట్టి రోడ్డు పక్కన పడేశారు. రాజారెడ్డి అనే వ్యక్తి తెదేపాలో క్రియాశీలంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక 2022 ఏప్రిల్‌లో అపహరించి ఓ తోటలో బంధించి రెండు కాళ్లు విరిచేశారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా గతేడాది ఆగస్టు 4న కురబలకోట మండలం అంగళ్లు నుంచి పూతలపట్టుకు వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన గొడవలకు సంబంధించి తెదేపా నేతలు, కార్యకర్తలు 600 మందిపై కేసులు పెట్టారు. 200 మందిని అరెస్టు చేశారు. పెద్దాయన, ఆయన అనుచరుల ఆదేశాల మేరకు సంబంధం లేని వ్యక్తులనూ కేసుల్లో ఇరికించారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వ్యాపారవేత్త, భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ను ఐదేళ్లలో అనేక వేధింపులకు గురిచేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని