Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!

భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్‌.........

Updated : 15 Aug 2022 12:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఐసీసీ నిర్వహించే టోర్నీలు ఎంతో విలువైనవి. వీటిల్లో మెరిసిన క్రీడా తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. మరి వజ్రోత్సవాల వేళ భారత క్రీడాలోకం సాధించిన ఘనతలను ఓసారి మననం చేసుకుందాం..!


గత ఒలింపిక్స్‌లోనే అత్యధిక పతకాలు

దాదాపు 125 ఏళ్ల కిందట (1896) తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమయ్యాయి. భారత్ మాత్రం 1900వ ఏడాదిలో ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించింది. రెండు సిల్వర్‌ పతకాలను గెలుచుకుంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి 1948 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పాల్గొంది. అప్పుడు కేవలం ఒకే ఒక్క స్వర్ణ పతకం వచ్చింది. అదికూడా హాకీలో కావడం విశేషం. మొత్తం ఇప్పటివరకు కేవలం 35 పతకాలను మాత్రమే సాధించింది. అందులో 10 స్వర్ణం, తొమ్మిది రజతం, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా తొలిసారి జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ ఒలింపిక్స్‌లో మొత్తం ఏడు పతకాలను భారత్ దక్కించుకుంది. ఇవే భారత చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన ఒలింపిక్స్‌ కావడం విశేషం.


కామన్వెల్త్‌లో అదుర్స్‌.. 

ఇంగ్లాండ్‌ పాలించిన దేశాల మధ్య ప్రారంభించిన క్రీడా పోటీలే ఇప్పుడు కామన్వెల్త్‌ గేమ్స్‌గా రూపాంతరం చెందాయి. ఒలింపిక్స్‌లో పెద్దగా రాణించలేకపోయిన భారత అథ్లెట్లు కామన్వెల్త్‌ గేమ్స్‌లో మాత్రం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. 1930నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌ జరుగుతున్నా.. తొలిసారి భారత్‌ 1934 నుంచే పాల్గొంటోంది. ఇప్పటివరకు 21సార్లు కామన్వెల్త్‌ గేమ్స్ జరగ్గా.. భారత్ కేవలం మూడు సార్లు మాత్రమే పాల్గొనలేదు. అయితే మొత్తం 564 పతకాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 203 బంగారు, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి. దిల్లీ వేదికగా జరిగిన 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ అత్యధికంగా 101 పతకాలు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన గేమ్స్‌లోనూ ఫర్వాలేదనిపించి 61 పతకాలతో సరిపెట్టుకుంది. ఇందులో 22 స్వర్ణం, 14 సిల్వర్, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే, షూటింగ్‌, ఆర్చరీ క్రీడలు లేకపోవడంతో భారత్‌కు వచ్చే పతకాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా లాంగ్‌జంప్‌, హైజంప్‌, క్రికెట్‌, జూడో, లాన్‌బౌల్స్ తదితర గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో మన క్రీడాకారులు పతకాలు సాధించారు. 


మెగా క్రికెట్ కప్‌లు.. మనకూ భాగస్వామ్యం

ఎన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచినా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచకప్‌లను సొంతం చేసుకుంటే ఆ దర్జానే వేరు. ఇప్పటివరకు 1975నుంచి 12 సార్లు జరిగిన వన్డే ప్రపంచకప్‌ల్లో టీమ్‌ఇండియా రెండుసార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 1983లో విండీస్‌నే ఢీకొట్టి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కపిల్‌ కెప్టెన్సీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్‌ను కొట్టడం విశేషం. అలాగే ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా 28 ఏళ్ల తర్వాత 2011లో రెండోసారి కప్‌ను ముద్దాడింది.

ఇక గత పదిహేనేళ్లుగా టీ20 క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ వచ్చింది. తొలిసారి 2007లో ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఫార్మాట్‌ కొత్త అయినప్పటికీ అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోనీ సారథ్యంలోని భారత్ కప్‌ దక్కించుకోవడం క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక టెస్టు ఫార్మాట్‌ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌.. కివీస్‌ చేతిలో ఓటమిపాలైంది. వజ్రోత్సవం నిర్వహించుకుంటున్న ఈ ఏడాదే ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది. మరికొన్ని నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ నెగ్గుతుందో.. లేదో వేచిచూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని