Javelin: బల్లెం వీరుడు-2.. నీరజ్‌ చోప్రాకు తోడుగా ఇంకో హీరో

ఆసియా క్రీడల్లోని జావెలిన్‌ విభాగంలో స్వర్ణం, రజత పతకాలు భారత్‌ అథ్లెట్లు సాధించారు. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రాతోపాటు మరొకరు పతకం గెలిచి వార్తల్లో నిలిచాడు. అతడే.. ఒడిశాకు చెందిన కిశోర్‌ కుమార్‌.

Updated : 18 Jul 2024 14:21 IST

జావెలిన్‌ త్రో అంటే ఇన్నాళ్లూ భారత క్రీడాభిమానులకు నీరజ్‌ చోప్రానే గుర్తుకొచ్చేవాడు. ప్రపంచ స్థాయిలో మనకు ఆశలే లేని ఆటలో అతను అద్భుతాలు చేశాడు. ఒలింపిక్స్‌లోనే కాక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. అయితే ఇప్పుడు నీరజ్‌కు తోడుగా ఇంకో బల్లెం వీరుడు వచ్చాడు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో రజతం గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్‌ దిశగా ఆశలు రేపుతున్న ఆ క్రీడాకారుడే.. కిశోర్‌ కుమార్‌ జెనా.

ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల జావెలిన్‌ త్రో పోటీల్లో.. ముందుగా భారత్‌ నుంచి నీరజ్‌ చోప్రానే పోటీలో నిలిచాడు. అతను తన తొలి త్రోను 85 మీటర్ల లోపే దగ్గరగా వేశాడు. తర్వాత భారత్‌ తరఫున కిశోర్‌ కుమార్‌ జెనా బరిలోకి దిగాడు. అతడి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 86.77 మీటర్లు త్రో విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నీరజ్‌ కన్నా అతడి త్రో దాదాపు రెండున్నర మీటర్లు ఎక్కువ. ఒక్కసారిగా అందిరిలోనూ షాక్‌. నీరజ్‌ను మించితే ఏ విదేశీ క్రీడాకారుడో మించాలి కానీ.. ఒక భారత క్రీడాకారుడు అలాంటి ప్రదర్శన చేయడమేంటని అందరూ వింతగా చూశారు ఆ క్రీడాకారుడి వైపు. ఆ సమయానికి అతడిదే అగ్రస్థానం. తర్వాత నీరజ్‌ 88.88 మీటర్ల త్రోతో అగ్రస్థానం సాధించాడు. కానీ కిశోర్‌ను మాత్రం వేరే క్రీడాకారులెవరూ అధిగమించలేకపోయారు. దీంతో ఆసియా క్రీడల జావెలిన్‌ త్రోలో అతడికి రజతం దక్కింది. ఇదేమీ ఆషామాషీ ప్రదర్శన కాదు. ఆసియా స్థాయిలో అతడిది ఆరో ఉత్తమ ప్రదర్శన. గత రెండేళ్లలో కిశోర్‌ ఎదుగుదల చూస్తే ఆసియా క్రీడల్లో అతడి మెరుపులు గాలివాటం కాదని అర్థమవుతుంది.

నాలుగేళ్ల ముందే ఇటు వైపు..

ఒడిశాకు చెందిన కిశోర్‌ కుమార్‌ జెనా నాలుగేళ్ల ముందు వరకు వాలీబాల్‌ క్రీడాకారుడు కావడం విశేషం. కానీ తన సామర్థ్యానికి జావెలిన్‌ త్రో బాగా సరిపోతుందని కోచ్‌ సూచన మేరకు అతను ఈ ఆటలోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లు కష్టపడితే తప్ప ఈ క్రీడలో ప్రపంచ స్థాయికి ఎదగడం సాధ్యం కాదు. కానీ కిశోర్‌ మాత్రం చకచకా ఈ ఆటలో ముందడుగు వేశాడు. ఆటలోకి వచ్చిన రెండేళ్లకే జాతీయ స్థాయికి ఎదిగాడు. రాష్ట్ర జావెలిన్‌ ఛాంపియన్‌షిప్‌లో దాదాపు 77 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు.

కోచ్‌ సిమ్రన్‌జీత్‌ దగ్గర శిక్షణ మొదలయ్యాక కిశోర్‌ ప్రదర్శన ఇంకా మెరుగుపడింది. ఏడాది కిందట అతను 80 మీటర్ల మార్కును అందుకున్నాడు. కొన్ని నెలల కిందట ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించినప్పటికీ కిశోర్‌ మీద పెద్దగా అంచనాలు లేవు. అందరి దృష్టీ నీరజ్‌ మీదే ఉంది. అంచనాలను అందుకుంటూ చోప్రా అక్కడ స్వర్ణం గెలిచాడు. ఆ ఈవెంట్లో 84.77 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేయడమే కాక.. అయిదో స్థానం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో అయిదో స్థానం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో ఇంకా మెరుగైన ప్రదర్శనతో రజతం గెలవడమే కాదు.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు.

కిశోర్‌ ప్రదర్శన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను మెప్పించింది. ఆయన ప్రభుత్వం తరఫున అతడికి రూ.1.5 కోట్ల నజరానా ప్రకటించడమే కాక.. ఒలింపిక్స్‌ సాధన దిశగా కోసం అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కిశోర్‌ ఇదే జోరు కొనసాగిస్తే.. పారిస్‌లో నీరజ్‌తో పాటు అతనూ పతకం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు