Surya Kumar Yadav: ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. ఇక వారికి నో ఛాన్స్‌: సూర్యకుమార్‌

సూర్యకుమార్‌ యాదవ్ (SuryaKumar Yadav) ఈ సీజన్‌ ఆరంభంలో కాస్త వెనుకడుగు వేసినా.. తర్వాత పుంజుకొని ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా గుజరాత్‌పైనా సెంచరీ సాధించాడు. దీంతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం సూర్య 479 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Updated : 13 May 2023 13:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు సాధించినా.. ఇప్పుడు ఐపీఎల్‌లో (IPL) తొలి సెంచరీ సాధించడం ప్రత్యేకమేనని సూర్యకుమార్‌ యాదవ్ (Surya Kumar Yadav) తెలిపాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. మైదానం నలువైపులా బౌండరీలతో ‘మిస్టర్ 360’ మరోసారి చెలరేగాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ అనంతరం సూర్యకుమార్‌ను బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్ ఓ ప్రశ్న అడిగాడు. సూర్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఐపీఎల్‌ నిర్వాహకులు తమ ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. 

మధ్వాల్: నువ్వు సెంచరీ సాధించడం బాగుంది. మీ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. దీనికి నువ్వెలా ఫీల్‌ అవుతున్నావు? 

సూర్యకుమార్‌ : చాలా ఆనందంగా ఉంది. కుటుంబమంతా ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించింది. మరీ ముఖ్యంగా దేవీషా కూడా ఇక్కడే ఉంది. నేను చేసిన మూడు అంతర్జాతీయ సెంచరీలను ఆమె చూడలేకపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఆమె చూస్తుండగానే శతకం బాదడం మరింత సంతోషం. దీంతో నా సతీమణి ఉంటే మూడంకెల స్కోరు సాధించలేనని వ్యాఖ్యానించే వారికి (నవ్వుతూ) ఇక నుంచి అలా అనేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఆ షాట్‌కు సచిన్‌ ఆశ్చర్యం

సూర్యకుమార్‌ కొట్టిన ఓ షాట్‌కు ముంబయి మెంటార్‌, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆశ్చర్యపోయాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా స్లైస్‌ చేసినట్లు ఆడిన సూర్య.. దానిని సిక్స్‌గా మలిచాడు. దీనిని చూసిన సచిన్‌ ఆ షాట్‌ను ఎలా ఆడాడనేది తన హవభావాలతో చూపించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని