AFG: అఫ్గాన్‌ క్రికెట్‌కు ఉందిలే మంచి కాలం.. ప్రపంచకప్‌ ప్రదర్శనతో భవిష్యత్‌పై ఆశలు

అఫ్గాన్‌ (AFG) అంటే బౌలింగ్‌లో సత్తాచాటి.. బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలయ్యే జట్టుగా పేరుండేది. కానీ ప్రపంచకప్‌తో (ODI World Cup 2023) ఆ ముద్ర చెరిగిపోయింది. ఇన్ని రోజులూ బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ ఇప్పుడు బలంగా మారింది. ఎప్పటిలాగే బౌలింగ్‌ దీనికి తోడైంది.

Published : 11 Nov 2023 11:37 IST

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అడుగుపెట్టింది అఫ్గానిస్థాన్‌. ఇప్పుడు టోర్నీలో ఆ జట్టు ప్రయాణం ముగిసింది. తమను ఇక ఏ మాత్రం కూనగా చూడొద్దని, పెద్ద జట్టుగానే పరిగణించాలని చాటింది. అవును.. ఈ మెగా టోర్నీకి ముందు, ఆ తర్వాత అఫ్గాన్‌ (AFG) జట్టు వేరు. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించి.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓటమి భయంతో భయపెట్టి.. అఫ్గాన్‌ అదరగొట్టింది. విజయాల కంటే కూడా ఆ జట్టు చూపిన వ్యక్తిత్వం, ఆటగాళ్ల ప్రదర్శన అఫ్గాన్‌కు కొత్త ఊపిరి పోసింది. భవిష్యత్‌పై ఆశలు పెంచింది. అఫ్గాన్‌ వీరులు ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ ఆ జట్టుదే! 

జట్టుగా అదుర్స్‌.. 

అఫ్గాన్‌ అంటే బౌలింగ్‌లో సత్తాచాటి.. బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలయ్యే జట్టుగా పేరుండేది. కానీ ప్రపంచకప్‌తో ఆ ముద్ర చెరిగిపోయింది. ఇన్ని రోజులూ బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ ఇప్పుడు బలంగా మారింది. ఎప్పటిలాగే బౌలింగ్‌ దీనికి తోడైంది. ఇంకేముంది అఫ్గాన్‌ చారిత్రక ప్రదర్శన సాకారమైంది. ముఖ్యంగా జట్టుగా అఫ్గాన్‌ ఆటగాళ్లు చూపిన వ్యక్తిత్వం, పోరాట స్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్ద జట్లను చూసి భయపడి వెనక్కి తగ్గడం కాదు.. సవాలు విసిరే పోరాటంతో గెలవడం అలవాటుగా మార్చుకుంది. ఏకంగా మూడు పెద్ద జట్లపై అఫ్గాన్‌ విజయాలే అందుకు నిదర్శనం. ఈ విజయాలు కూడా ఏదో గాలివాటం కాదు. పూర్తి ఆధిపత్యంతో, సాధికారికంగా సాధించినవే. ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించడం ఓ సంచలనం అయితే.. ఛేదనలో ఏ మాత్రం పొరపాట్లకు తావివ్వకుండా లక్ష్యాన్ని అందుకుని పాకిస్థాన్, శ్రీలంకను చిత్తుచేయడం అద్భుతమే. ఆస్ట్రేలియాను చివరి వరకూ అఫ్గాన్‌ భయపెట్టింది. మ్యాక్స్‌వెల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ లేకపోతే అఫ్గాన్‌ మరో సంచలనంతో సెమీస్‌లో అడుగుపెట్టేదే. ఇక చివరి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికాను వణికించింది. బౌలింగ్‌లో స్పిన్‌ దాడితో, బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డర్‌ నిలకడతో ఆ జట్టు సాగింది. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి ఉండే ఛేదనలో అఫ్గాన్‌ బ్యాటర్లు చూపించిన తెగువ అమోఘం. 

అన్ని విభాగాల్లోనూ..

ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ కేవలం ఒక్కదాంట్లోనే కాదు అన్ని విభాగాల్లోనూ సత్తాచాటింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అబ్బురపరిచింది. బ్యాటింగ్‌లో ముఖ్యంగా టాప్‌ఆర్డర్‌ అదరగొట్టింది. ఇబ్రహీం జాద్రాన్‌ 9 మ్యాచ్‌ల్లో 47 సగటుతో 376 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఓ ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడతను. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 70.60 సగటుతో 353 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మందకొడి పిచ్‌పై అతను చూపించిన పట్టుదల మెచ్చుకోవాల్సిందే. రహ్మత్‌ షా (320 పరుగులు), గుర్బాజ్‌ (280) కూడా ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (310 పరుగులు) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఛేదనలో చివరి వరకూ క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చడంలో పట్టుదల ప్రదర్శించిన అతను.. సారథిగా జట్టును అసాధారణ విజయాల వైపు నడిపించాడు. మరోవైపు బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ (11 వికెట్లు), మహమ్మద్‌ నబి (8), నవీనుల్‌ హక్‌ (8), ముజీబుర్‌ రెహ్మాన్‌ (8), అజ్మతుల్లా (7), ఫరూఖీ (6), నూర్‌ అహ్మద్‌ (5) కూడా నిలకడగా రాణించారు. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లతో దాడి కొనసాగించిన అఫ్గాన్‌ ఫలితాలు రాబట్టింది. ఇలా జట్టు ఏ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా.. సమష్టి ఆటతీరుతో విజయాలు సాధిస్తుండటం అఫ్గాన్‌కు గొప్ప సానుకూలాంశం. ఇదే ఇప్పుడు భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని