Afghanistan: అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్‌

ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్లో ఒక్క మ్యాచ్‌ అయినా గెలిస్తే చాలని చిన్న జట్లు భావిస్తాయి. పసికూనలు తమపై పెద్ద జట్లు రికార్డులు కొట్టకూడదని ప్రార్థిస్తాయి. అలాంటి జట్లు ఒకటి కాదు రెండు కాదు అంతకుమించి మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌పై కన్నేస్తే!

Published : 04 Nov 2023 15:15 IST

ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్లో ఒక్క మ్యాచ్‌ అయినా గెలిస్తే చాలని చిన్న జట్లు భావిస్తాయి. పసికూనలు తమపై పెద్ద జట్లు రికార్డులు కొట్టకూడదని ప్రార్థిస్తాయి. అలాంటి జట్లు ఒకటి కాదు రెండు కాదు అంతకుమించి మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌పై కన్నేస్తే! 2003 ప్రపంచకప్‌లో కెన్యా ఒక్కో అడుగువేస్తూ సెమీస్‌ చేరి సంచలనమే సృష్టించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ కూడా సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో సెమీస్‌ఫైనల్‌ దిశగా సాగుతోంది. 

కెన్యా ఓ సంచలనం

ప్రపంచకప్‌లో చిన్న జట్లు ఒకటి  రెండు సంచనాలు చేయడం మామూలు విషయమే. ఐర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే ఇలాగే పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చాయి. అయితే అవి ఒకటి రెండు మ్యాచ్‌లకు పరిమితం. కానీ అంతకుమించి ముందు వెళ్తే.. కచ్చితంగా విశేషమే! కెన్యా ఈ కోవకే చెందుతుంది. 2003 ప్రపంచకప్‌లో కెన్యా ఓ సంచలనం. అఫ్గానిస్థాన్‌తో ఆ జట్టును పోల్చలేం. ఎందుకంటే అఫ్గాన్‌ ప్రస్తుతం ఓ మోస్తరు జట్టే. కానీ కెన్యా పసికూనకు నిర్వచనం. ఆ జట్టులో స్టార్లు లేరు.. వాళ్లకు పెద్దగా వసతులు లేవు. రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. అయినా కూడా 1996 ప్రపంచకప్‌లో రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను ఓడించి ప్రకంపనలు రేపింది ఈ జట్టు. 1999 ప్రపంచకప్‌లో బరిలో దిగినా అలాంటి ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. దీంతో 2003లో ఈ జట్టును మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక్కో మ్యాచే గెలుచుకుంటూపోయి.. ఒక్కో మెట్టే ఎక్కుతూ ఏకంగా సెమీఫైనల్‌ చేరి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. న్యూజిలాండ్‌పై వాకోవర్‌ రావడంతో అదృష్టం వరించిన ఈ జట్టు.. ఆతర్వాత శ్రీలంక, కెనడా, బంగ్లాదేశ్, జింబాబ్వేలను ఓడించి సెమీస్‌కు చేరి ప్రకంపనలు రేపింది. అయితే సెమీస్‌లో భారత్‌ చేతిలో ఓడడంతో ఆ జట్టు కథ ముగిసింది.

అఫ్గాన్‌ది వేరే కథ

2023 ప్రపంచకప్‌ ఆడుతున్న అఫ్గాన్‌ది కెన్యాతో పోలిస్తే భిన్నమైన కథ. ఈ కప్‌కు వచ్చేసరికి ఆ జట్టు ఓ మాదిరి జట్టుగానే ఉంది. అందులోనూ టెస్టు హోదా కూడా సంపాదించింది. తనకన్నా కాస్త మెరుగైన జట్లపై గెలవగల సత్తా ఉన్న జట్టుగా నిరూపించుకుంది. అయినా కూడా ప్రపంచకప్‌లో ఒక్క నెదర్లాండ్స్‌ను పక్కనపెడితే మిగిలిన జట్ల కన్నా అఫ్గాన్‌ స్థాయి ఒక మెట్టు కిందే. అయితే స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తున్న ఆ జట్టు అద్భుత విజయాలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు షాకివ్వడం హైలైట్‌. శ్రీలంక, పాకిస్థాన్‌లపై గెలవడం ఆ జట్టు సత్తాకు నిదర్శనం. ఈ విజయాలేవీ అఫ్గాన్‌ గాలివాటంగా సాధించలేదు. సాధికారికంగా ఆడి గెలిచింది. ముఖ్యంగా పాక్‌తో మ్యాచ్‌లో అయితే 283 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. పాక్‌ పేస్‌ పవర్‌ని తట్టుకుని ఏమాత్రం తడబాటు లేకుండా విజయాన్ని అందుకుంది. స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయడం.. బ్యాటింగ్‌లో స్థిరత్వం చూపడం అనే ప్రణాళికతో అఫ్గాన్‌ ముందుకు సాగుతోంది. ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు అదరగొడుతోంది. తాజాగా నెదర్లాండ్‌పై గెలవడంతో 8 పాయింట్లతో అఫ్గాన్‌ సెమీస్‌ దిశగా మరో అడుగు వేసింది. కెన్యా తర్వాత ప్రపంచకప్‌లో ఒక చిన్న జట్టు ఇన్ని మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక సంచలన విజయాలతో కప్‌ ఎగరేసుకుపోయినా.. అప్పటికి ఆ జట్టు ఓ మాదిరి జట్టే. పైగా తొలి ప్రపంచకప్‌ నుంచి లంక ఆడుతోంది. అయితే కెన్యా మాదిరిగా అఫ్గాన్‌ సెమీస్‌ గడప తొక్కితే మాత్రం పెద్ద సంచలనమే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని