Afghanistan Team: అఫ్గాన్‌కు నిజంగా ఛాన్సుందా?.. ప్రపంచకప్‌లో సెమీస్‌ అవకాశాలు ఏమాత్రం?

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇక మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లు 11 మాత్రమే. ఇంకా మూడు సెమీస్‌ బెర్తులు తేలాల్సి ఉంది.

Published : 04 Nov 2023 10:57 IST

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) లీగ్‌ దశ చివరి అంకంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే భారత జట్టు అధికారికంగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లాండ్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ల నిష్క్రమణ లాంఛనమే కావచ్చు. మిగతా మూడు బెర్తుల కోసం అయిదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆ అయిదు జట్లలో అఫ్గానిస్థాన్‌ కూడా ఒకటి కావడం విశేషం. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించిన అఫ్గాన్‌.. పెద్ద జట్లతో పాటుగా సెమీస్‌ రేసులో నిలిచి ఆశ్చర్యపరిచింది. మరి ఈ జట్టు టోర్నీలో సంచలన విజయాలు సాధించినట్లే.. సెమీస్‌ బెర్తును కూడా సొంతం చేసుకుని సంచలనం రేపే ఛాన్స్‌ ఉందా?

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇక మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లు 11 మాత్రమే. ఇంకా మూడు సెమీస్‌ బెర్తులు తేలాల్సి ఉంది. ఏడుకు ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ మాత్రమే సెమీస్‌ చేరగా.. మిగతా మూడు బెర్తులు తేలాల్సి ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ కూడా బాగుంది కాబట్టి చివరి రెండు మ్యాచ్‌ల్లో (భారత్, అఫ్గానిస్థాన్‌లతో) ఓడినా ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ. పట్టికలో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), న్యూజిలాండ్‌ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. 7 మ్యాచ్‌ల్లో 3 నెగ్గిన పాక్‌ నిన్నటిదాకా అయిదో స్థానంలో ఉండేది. కానీ శుక్రవారం అఫ్గానిస్థాన్‌ నాలుగో గెలుపు (ఆడిన మ్యాచ్‌లు 7)తో అయిదో స్థానానికి ఎగబాకింది. టోర్నీ చివరి దశలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి జట్లను వెనక్కి నెట్టి అఫ్గాన్‌ పైన ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

ముందంజ వేయాలంటే..

కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ ప్రదర్శన చూస్తున్న వాళ్లందరూ.. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి జట్లను ఓడించగలదనే భావించారు. కానీ ఆ జట్టు అంచనాలను మించిపోయి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంకలకు షాకిచ్చింది. టోర్నీని మామూలుగానే ఆరంభించిన ఆ జట్టు.. తర్వాత అనూహ్య ప్రదర్శనతో ఆందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి 3 మ్యాచ్‌ల్లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లను ఓడించడంతో అఫ్గాన్‌ను ఇప్పుడు అందరూ సీరియస్‌గా తీసుకుంటున్నారు. అదే ప్రదర్శన కొనసాగించి, అదృష్టం కలిసొస్తే ముందంజ వేసినా వేయొచ్చని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం అఫ్గాన్‌లో ఆశలు పెంచుతోంది. దక్షిణాఫ్రికాతో పాటు మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా రెండు సెమీస్‌ బెర్తులు సొంతం చేసుకుంటాయనుకుంటే.. సమీకరణాలు కలిసొస్తే అఫ్గాన్‌ ముందంజ వేయొచ్చు.

చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లను ఓడించడం చాలా కష్టమైనప్పటికీ.. అఫ్గాన్‌ ఒక్క మ్యాచ్‌లో సంచలనం సృష్టించినా.. దాని అవకాశాలు మెరుగవుతాయి. అదే సమయంలో పాకిస్థాన్, శ్రీలంకలతో తలపడబోతున్న కివీస్‌.. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. లేదా ఒక్క మ్యాచ్‌ ఓడినా.. నెట్‌రన్‌రేట్‌లో అఫ్గాన్‌ కన్నా వెనుకబడాలి. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఓడిపోయినా.. అఫ్గాన్‌కు ఛాన్సుంటుంది. కానీ అఫ్గాన్‌కు నెట్‌రన్‌రేట్‌ తక్కువ ఉండటం మైనస్‌. ఇందులో మిగతా జట్లను అధిగమించడం అంత తేలిక కాదు. అందుకే ఈ సమీకరణాలన్నీ సాధ్యపడి అఫ్గాన్‌ సెమీస్‌కు చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. కానీ టోర్నీలో ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం ఏదైనా జరగొచ్చని అనిపిస్తోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈసారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటుందని ఎవరైనా ఊహించారా? మరి అఫ్గాన్‌కు అన్నీ కలిసొచ్చి ముందంజ వేసే అవకాశాలను ఎలా కొట్టి పారేస్తాం?

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని